ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత సుఖవంతం

15 Apr, 2022 03:56 IST|Sakshi

ప్రయాణికులకు మరింత సౌకర్యంగా బస్సులు

అద్దె విధానంలో కొత్తగా 998 బస్సులు

1,150 బస్సుల ఆధునికీకరణ

దశలవారీగా 2 వేల ఇ–బస్సులు 

ప్రణాళికలను వేగవంతం చేసిన ఆర్టీసీ

సాక్షి, అమరావతి: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అనే నినాదాన్ని మరింత నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దశాబ్దంగా పాతబడిన బస్సులతోనే నెట్టుకొస్తున్న దుస్థితికి ఇక ముగింపు పలకనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 3,800 బస్సులు బాగా పాతబడ్డాయని గుర్తించారు. ఏసీ బస్సులు 10 లక్షల కి.మీ., ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. సర్వీసును పూర్తి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వం వివిధ కారణాలతో కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదు. దీంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు బ్రేక్‌డౌన్‌ కావడం, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ముగింపు పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకోసం మూడంచెల విధానానికి ఆమోదం తెలిపింది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్‌ ప్రక్రియ ద్వారా ఆధునికీకరించడం.. పర్యావరణహితంగా దాదాపు 2 వేల డీజిల్‌ బస్సులను ఇ–బస్సులుగా మలచడం దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 

జూలై చివరికి రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండోవారం నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీంతో జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు తిప్పడానికి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇక 1,150 బస్సులను ఫేస్‌లిఫ్ట్‌ ప్రక్రియ ద్వారా ఆధునికీకరిస్తున్నారు. కొత్త సీట్లు వేయడం, టైర్లు మార్చడం, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ద్వారా నూతన రూపు తెస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ గ్యారేజీలలో వెయ్యి బస్సులకు ఫేస్‌లిఫ్ట్‌ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ప్రయాణికులకు ఆ బస్సులు సౌకర్యవంతంగా మారాయి.

150 ఇ–బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ దశలవారీగా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో నడపడానికి 150 ఇ–బస్సుల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ఉన్న దాదాపు 2 వేల డీజిల్‌ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు రెట్రోఫిట్‌మెంట్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక డీజిల్‌ బస్సును రెట్రోఫిట్‌ చేసి ఇ–బస్సుగా మార్చారు. త్వరలో ఆ బస్సును పుణెలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఐఆర్‌టీ) పరిశీలనకు పంపించనున్నారు. సీఐఆర్‌టీ ఆమోదించాక ఆ ప్రమాణాల మేరకు దాదాపు 2 వేల డీజిల్‌ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మారుస్తారు.

ప్రయాణికులకు సుఖమయ ప్రయాణమే లక్ష్యం
ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. దీర్ఘకాలంగా ఉన్న పాత బస్సుల సమస్య త్వరలో పరిష్కారం కానుంది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెడతాం. అలాగే దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ కోసం ఇ–బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను వేగవంతం చేస్తున్నాం.
– సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, ఎండీ, ఆర్టీసీ 

మరిన్ని వార్తలు