నేటి నుంచి గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన

తొలి సమావేశం ఏర్పాటుకు పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్‌  

అన్ని చోట్లా సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం 

ఎన్నికల కోడ్‌తో నిరాడంబరంగా కార్యక్రమం  

2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలోనే పంచాయతీలు 

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్‌ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది.

2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2020 మార్చిలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నించగా, అప్పటి ఎస్‌ఈసీ కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,097 గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఏప్రిల్‌ 3వ తేదీన కొత్తగా ఎన్నికైన సభ్యులతో తొలి సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో తాజాగా గ్రామాల్లో మళ్లీ సర్పంచ్‌ల పాలన కొనసాగబోతుంది.  

ప్రమాణ స్వీకారం.. ప్రతిజ్ఞ 
► కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు శనివారం నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించి ఘనంగా జరిపేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు నిర్ణయించారు.  
► అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని నిర్ణయించారు. 
► శనివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, వర్షపు నీటి సంరక్షణపై అన్ని గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేస్తారు.  
► 12.15 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కొత్తగా ఎన్నికైన సభ్యుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. అన్ని చోట్ల  కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారితో గ్రామ పంచాయతీల మొదటి çసమావేశం నిర్వహిస్తారు.  

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు