‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత

7 Feb, 2023 05:14 IST|Sakshi

రహదారులపై నిబంధనలు ఇక కచ్చితంగా అమలు

భారీ వాహనాలు ఎడమవైపు లైన్లోనే వెళ్లాలి

తొలిసారి అతిక్రమిస్తే రూ.500 ఫైన్‌

తరువాత ప్రతిసారికి రూ.వెయ్యి జరిమానా

సాక్షి, అమరావతి: ‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత మోగుతుంది..’ అంటోంది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ). హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హైవేలతోపాటు రాష్ట్ర ప్రధాన రహదారులపై కూడా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

మార్కింగ్‌ లైన్లు దాటి వాహనాలు ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో హైవేలపై భారీ వాహనాలు మార్కింగ్‌ లైన్లు దాటి ప్రయాణించడంతో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 8,200 మంది దుర్మరణం చెందారు.

ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రధానంగా భారీ వాహనాలు మార్కింగ్‌ లైన్లు దాటి ప్రయాణిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోందని గుర్తించారు. మార్కింగ్‌ లైన్లు దాటి ప్రయాణించే వాహనాలపై ఎన్‌హెచ్‌ఏఐ భారీ జరిమానాలను ఖరారుచేసింది. భారీ వాహనాలు కచ్చితంగా హైవేలపై ఎడమలైన్‌లోనే ప్రయాణించాలి.

ముందు నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయాల్సి వస్తే తప్ప లైన్‌ దాటడానికి వీల్లేదు. అలా ఓవర్‌టేక్‌ చేసిన వెంటనే మళ్లీ ఎడమవైపు లైన్‌లోకి వచ్చేయాలి. అలాకాకుండా ఒక 200 మీటర్లకు మించి ఎడమవైపు లైన్‌ను దాటి ప్రయాంచే భారీ వాహనాలపై తొలిసారి రూ.500 జరిమానా విధిస్తారు. అదే వాహనం తరువాత లైన్‌ క్రాస్‌చేస్తే ప్రతిసారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తారు. 

నిబంధనలు పాటించాలి 
భారీ వాహనాలు కచ్చితంగా నిబంధనలను పాటించేలా హైవే పెట్రోలింగ్‌ అధికారులు కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది గుర్తించిన వాహనాలతోపాటు హైవేలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టోల్‌గేట్ల వద్ద సీసీ కెమెరాల  పుటేజీలను తరచూ పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధిస్తారు.

రాష్ట్ర రహదారులపైన కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకుగాను రాష్ట్ర ప్రధాన రహదారులపై వాహనచోదకులకు మార్గనిర్దేశం చేసేలా సైన్‌ బోర్డులు, లైన్‌ మార్కింగులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్త జరిమానాల విధానం అమలు చేయాలని చెప్పింది. ఈ లోపు రాష్ట్ర ప్రధాన రహదారులపై సైన్‌ బోర్డులు, లైన్‌ మార్కింగ్‌లు పూర్తిచేయాలని సూచించింది.  

మరిన్ని వార్తలు