‘ఫ్యామిలీ డాక్టర్‌’తో మెరుగైన వైద్య సేవలు

22 Oct, 2022 09:47 IST|Sakshi

హిందూపురం: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ అన్నారు. విలేజ్‌ క్లినిక్‌లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు,  వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌ రన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు.  

ఫ్యామిలీ డాక్టర్‌తో సంపూర్ణ రక్షణ 
పుట్టపర్తి అర్బన్‌: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ఎంతో ఉపయోగకరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. స్థానిక పాఠశాల వద్ద ఓపీ నిర్వహించగా, మధ్యాహ్నం వరకూ గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు వంటి వాటికి మందులు తీసుకున్నారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని, గర్భిణులు, బాలింతల ఇళ్లకే వెళ్లి వైద్యలు పరీక్షించి మందులు ఇచ్చారు.

కొందరిని మెరుగైన వైద్యం కోసం రెఫర్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి, నిరుపేదలకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నెలా వైద్య బృందం గ్రామానికి విచ్చేసి రోజంతా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మానాయక్,  పుట్టపర్తి వైద్యాధికారి నాగరాజు నాయక్, సీహెచ్‌ఓ నగేష్‌, రమణయ్య, సూపర్‌వైజర్లు చంద్రకళ, రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.   

(చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి )

మరిన్ని వార్తలు