పల్లెవించిన నాగరికత.. మారిన గ్రామీణ రోడ్లు

28 Apr, 2022 11:34 IST|Sakshi

ఇది ఓబుళదేవరచెరువు మండలం ఇనగలూరు పంచాయతీలోని గొల్లపల్లె రహదారి. ఒకప్పుడు ఈ ఊరికి మట్టిరోడ్డే గతి. అడుగడుగునా కంకర తేలి, గుంతలమయంగా దర్శనమిచ్చేది. ప్రయాణానికి ఏమాత్రం అనువుగా ఉండేది కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా ఆస్పత్రులకు తరలించాలన్నా సాధ్యం కాని పరిస్థితి. చివరకు ఈ ఊరి యువకులకు పిల్లనిచ్చేందుకూ ఎవరూ ఆసక్తి చూపే వారు కాదు. అయితే, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. రూ.1.50 కోట్లతో 3.9 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.  


ఇది నల్లమాడ మండలం చారుపల్లి నుంచి సి.రెడ్డివారిపల్లి వరకు వెళ్లే రహదారి. దశాబ్దాలుగా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే రూ.1.10 కోట్లతో కిలోమీటర్‌ మేర     సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు. చుట్టుపక్కల పల్లెలతో రవాణా అనుసంధానమూ పెరిగింది.   

సాక్షి, పుట్టపర్తి/ అనంతపురం సిటీ: నాగరికతకు రహదారులను చిహ్నాలుగా భావిస్తారు. రోడ్లు బాగుంటే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య అనుసంధానం పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగవడంతో అభివృద్ధి కూడా    వేగంగా సాగుతుంది. ఈ విషయాలన్నింటికీ అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్‌సీపీ సర్కారు రహదారులకు మహర్దశ తీసుకొచ్చింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులపై దృష్టి సారించి దశాబ్దాలుగా రాళ్లురప్పలతో అధ్వానంగా దర్శనిమిచ్చిన దారులను సుందరంగా మార్చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 170 గ్రామీణ రహదారులు నిర్మించారు. మొత్తం 591.41 కిలోమీటర్ల మేర రోడ్లు కొత్తగా వేసి సౌకర్యాలు మెరుగుపరిచారు. దీంతో పాటు మరో 52 ప్రధాన రహదారుల్లో మరమ్మతుల కోసం రూ. 70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేసి 39 చోట్ల పనులు పూర్తి చేశారు. మరో 11 రహదారులకు సంబంధించి పనులు టెండర్‌ దశలో ఉన్నట్లు అధికారులు వివరించారు. 

టీడీపీ హయాంలో జనం మొత్తుకున్నా వినలేదు.. 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల్లో     గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా ఉండేది. రోడ్లను అభివృద్ధి చేయాలని గ్రామీణులు అనేక సార్లు విన్నవించినా అప్పట్లో నేతలు పట్టించుకోలేదు. కొన్ని చోట్లయితే తూతూమంత్రంగా శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత మర్చిపోయారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం దొరకడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

దశాబ్దాల కల నెరవేరింది
దాదాపు 50 ఏళ్లు మోకాళ్లలోతు గుంతలు, రాళ్లు తేలిన మట్టిరోడ్డుతో చాలా ఇబ్బంది పడేవాళ్లం. టీడీపీ హయాంలో పలుసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప రోడ్డు నిర్మించలేదు. చారుపల్లి నుంచి సీ రెడ్డివారిపల్లికి సీసీ రోడ్డు నిర్మించడంతో మా దశాబ్దాల కల నెరవేరింది. చౌటతండా మీదుగా కొండమనాయునిపాలెం వరకు తారురోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.  
– మధుసూదన్‌రెడ్డి, సీ రెడ్డివారిపల్లి, నల్లమాడ మండలం 

చాలా సంతోషంగా ఉంది
మా పల్లెకు  సీసీ రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఎన్నోసార్లు అధికారులు, నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. సీసీ రోడ్డు నిర్మాణంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతలు. 
– అశ్వర్థనారాయణ, రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్, సీ రెడ్డివారిపల్లి 

త్వరితగతిన పనులు
రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. దశాబ్దాల నుంచి అధ్వానంగా ఉన్న గ్రామీణ దారులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి పనులు చేపడుతున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం.            
– ఓబుళరెడ్డి, ఎస్‌ఈ, రోడ్లు, భవనాల శాఖ  

మరిన్ని వార్తలు