మేము క్షేమం.. కానీ భయంగా ఉందమ్మా!

1 Mar, 2022 15:01 IST|Sakshi
ఉక్రెయిన్‌ దేశంలోని చెర్నీ వెస్ట్‌ నుంచి రుమేనియా సరిహద్దు ప్రాంతానికి బస్సులో బయల్దేరిన కుమరస్వామి, వంశీకృష్ణలు

వీరఘట్టం/పాలకొండ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యార్థులు వీరఘట్టం, పాలకొండలో ఉన్న వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తమ క్షేమ సమాచారాన్ని తెలిపారు. వీరఘట్టం, పాలకొండకు చెందిన నడిమింటి కుమారస్వామి, సదాశివుని వంశీకృష్ణలు సోమవా రం వీరుంటున్న చెర్నీ వెస్ట్‌ నుంచి పయనమయ్యారు. అక్కడ ఉదయం 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు చెర్నీ వెస్ట్‌ నుంచి రుమేనియా సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ నుండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమేనియా విమానాశ్రయానికి చేరుకుంటామని వీరు తెలిపారు. అక్కడ ప్రాధాన్యతా క్రమంలో విద్యార్థులను ఇండియాకు పంపిస్తున్నారని, తాము వచ్చేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని వారు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న తమ పిల్లలను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని బాధిత తండ్రి నడిమింటి సీతంనాయుడు అన్నారు. 

క్షేమంగా తీసుకువస్తాం.. 
ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన యాదం శ్వేత ఉక్రెయిన్‌లో చిక్కుకుంది. ఆమె అక్కడ వైద్య విద్య అభ్యసిస్తోంది. ఈ మేరకు గాంధీ పార్కు వద్ద నివాసముంటున్న విద్యార్థిని పిన్ని తెల్లి రాధిక ఇంటి వద్దకు తహసీల్దార్‌ వి.శంకర్‌రావు సోమవారం వెళ్లి మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులు యాదం లలిత, అప్పలస్వామిలు అండమాన్‌లో ఉంటున్నారు. విద్యార్థినిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.     

ఇంకా రుమేనియా బోర్డర్‌లోనే.. 
పాలకొండ రూరల్‌: పట్టణంలోని వడమ కాలనీకు చెందిన లచ్చుబుక్త శ్రీకాంత్‌ ఇంకా రుమేనియా బోర్డర్‌లోనే ఉన్నట్లు విద్యార్థి తండ్రి శంకరరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వినిస్సా నుంచి బస్సు మార్గంలో రుమేనియా సరిహద్దులకు చేరిన తమ కుమారుడి సెల్‌లో చార్జింగ్‌ అయిపోయిందని వారు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్నేహితుల సెల్‌ ద్వారా తనతో మాట్లాడి క్షేమ సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.    

ఇంటికి చేరుకున్న వైశాలి 
పాతపట్నం: పాతపట్నంలోని విద్యనగర్‌ చెందిన వైద్య విద్యార్థిని సిమ్మ కోహిమ వైశాలి సోమవారం ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి వచ్చేంత వరకు అధికారులు వెన్నంటే ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమె శనివారం రాత్రి ఉక్రెయిన్‌ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుని, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్నారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు ఆదివారం రాత్రి చేరుకుని, అక్కడి నుంచి ఇంటికి వచ్చినట్లు వైశాలి తెలిపింది. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. విశాఖపట్నం నుంచి రెవెన్యూ సిబ్బంది రిసీవ్‌ చేసుకుని, కారులో ఇంటికి తీసుకు వచ్చారని విద్యార్థిని తెలిపింది.   

మరిన్ని వార్తలు