ఆర్‌వీ నగర్‌కు రానున్న కాఫీ పరిశోధన స్థానం

9 Apr, 2022 18:28 IST|Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లాతో ఏర్పాట్లు వేగవంతం

రైతుల చెంతకే శాస్త్రవేత్తల సేవలు

కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్‌వీనగర్‌లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్‌వీ నగర్‌ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.  అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో  కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది.

గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్‌వీ నగర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. 
కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్‌.వి.నగర్‌లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను  ఈ విభాగం సమకూరుస్తోంది.   

మావోయిస్టులు పేల్చేయడంతో.. 
ఆర్‌వీనగర్‌లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు.  

లక్షన్నర ఎకరాల్లో సాగు 
కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్‌వీ నగర్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. 

శాస్త్రవేత్తల సహకారం అవసరం 
ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది.  కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా.      
– గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు

కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు 
రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.   
– కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే

ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత
కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల  సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్‌పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్‌వీ నగర్‌కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.  
– అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం 

మరిన్ని వార్తలు