ఇండియాకే ఆదర్శం ఆర్బీకేలు

3 Dec, 2021 04:25 IST|Sakshi

ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు

ఈ క్రాప్, ఈ కేవైసీ, బ్యాంకింగ్‌ సేవలు అద్భుతం

ఇవి జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవి

ఆర్బీఐ ఉన్నతాధికారుల ప్రశంస

రాష్ట్ర ఉన్నతాధికారులతో ముంబైలో భేటీ

ఆర్బీకేల పరిశీలనకు త్వరలో వస్తామని వెల్లడి

సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా  

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా అందిస్తోన్న సేవలు జాతీయస్థాయిలో అమలు చేయతగ్గవేనని ఆర్బీఐ ఉన్నతాధికారుల బృందం పేర్కొంది. ఆర్బీకేల ఏర్పాటు ఆలోచన వినూత్నం, విప్లవాత్మకమని కొనియాడింది. గ్రామ స్థాయిలో రైతుల ముంగిట అందిస్తోన్న సేవలు మరో హరిత విçప్లవానికి నాంది పలికేందుకు దోహదపడతాయని అభిప్రాయపడింది. ఆర్బీకేలకు ఆర్బీఐ అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చింది. ఆర్బీఐ బోర్డు ఆహ్వానం మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబులతో కూడిన ఏపీ బృందం గురువారం ముంబై వెళ్లింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్బీకేల విశిష్టతలు, అందిస్తోన్న సేవలపై స్పెషల్‌ సీఎస్‌ వివరించారు. అవేమిటంటే..

► సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకనుగుణంగా పౌరసేవలు ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చింది.
► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి సాగు ఉత్పాదకాలను రైతుల గడప వద్దకు తీసుకెళ్తున్నాం. ఈ క్రాప్, ఈ కేవైసీ విధానాల ద్వారా వాస్తవ సాగు దారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నాం.
► ఈ క్రాప్‌ ఆధారంగా దేశంలో మరెక్కడా లేని విధంగా సుమారు 10 లక్షల మంది కౌలు రైతులకు సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా, పెట్టుబడి రాయితీ వంటి సంక్షేమ ఫలాలన్నీ అందిస్తున్నాం.
► బ్యాంకర్లు నిర్వహించే ఈ–లోన్‌ రిజిస్టర్‌గా ఈ క్రాప్‌ రిజిస్టర్‌ను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరుగుతుంది. దీన్ని ఆర్బీఐ బోర్డు ఉన్నతాధికారులు పరిశీలించాలి.
► బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఆర్బీకేలకు అనుసంధానించడం ద్వారా గ్రామ స్థాయిలో ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం.

జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవే..
ఆర్బీకేల ద్వారా అందిస్తోన్న సేవలు జాతీయస్థాయిలో అమలు చేయతగ్గవే. ఈ క్రాప్‌ ద్వారా పంటల వారీగా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను నమోదు చేస్తున్న తీరు బాగుంది. వాస్తవ సాగుదారులకు పంట రుణాలతో పాటు అన్నిరకాల రాయితీలు అందేలా ఈ క్రాప్‌ను ఈ కేవైసీతో అనుసంధానించడం మంచి ఆలోచన. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ల ద్వారా ఆర్బీకేల్లో గ్రామస్థాయిలో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం. ఈ తరహా ప్రయత్నం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు చూడలేదు. ఆర్బీకేల సందర్శనకు త్వరలోనే ఓ బృందాన్ని పంపిస్తాం. ఈ పర్యటన అనంతరం ఆర్బీకేలకు అందించే సహాయ, సహకారాలపై కార్యాచరణ రూపొందిస్తాం.
– ఆర్బీఐ సీజీఎంలు కయా త్రిపాఠి, సోనాలి సేన్‌ గుప్త 

మరిన్ని వార్తలు