మే 13న తొలివిడత రైతు భరోసా

11 Apr, 2021 03:18 IST|Sakshi
కృష్ణా జిల్లా మల్లవోలులో జాబితాలోని తమ పేర్లను పరిశీలిస్తున్న రైతులు

అర్హత ఉండి ఇంకా లబ్ధిపొందని వారికి మరో అవకాశం

దరఖాస్తుకు 30 వరకు గడువు

గతేడాది 51.59 లక్షల మందికి రూ.6,928 కోట్లు సాయం

ప్రస్తుత సంవత్సరంలో రూ.7,290 కోట్లకు పెరిగిన పెట్టుబడి సాయం

ఈ ఏడాది ఇప్పటివరకు 54 లక్షల మంది రైతులకు అర్హత

తొలి విడత అర్హుల జాబితా మే 10న వెల్లడి

సాక్షి, అమరావతి: గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ సాగు నిమిత్తం వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. గతేడాది లబ్ధిపొందిన వారితో పాటు గత రెండేళ్లుగా లబ్ధిపొందని అర్హుల కోసం ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తుకు గడువిచ్చింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రైతులకు పీఎం కిసాన్‌ సాయం రూ.6వేలతో పాటు రైతుభరోసా కింద రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500లు చొప్పున పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో అందిస్తోంది.

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానుల ఖాతాల్లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500లు, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో రూ.2వేల చొప్పున జమచేస్తున్నారు. ఎలాంటి భూమి లేని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతు కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న రైతు కుటుంబాలకు ఈ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2019–20లో 46,69,375 మంది రైతు కుటుంబాలకు రూ.6,173కోట్లు.. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు సాయం అందించారు. అలాగే, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారు తొలి ఏడాదిలో 1,58,123 మంది, రెండో ఏడాది 1,54,171 మంది ఈ పథకం కింద లబ్ధిపొందారు.

ఏటేటా పెరుగుతున్న ‘భరోసా’
తొలి ఏడాది పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.2,525 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.3,648 కోట్లు సాయం అందించింది. గతేడాది కేంద్రం రూ.2,966 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,962 కోట్లు అందించింది. ఇక ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అర్హత పొందిన 54 లక్షల మంది లబ్ధిదారులకు 3 విడతల్లో రూ.7,290 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్‌ కింద రూ.3,060 కోట్లు, రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4,230 కోట్లు అందించనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అర్హత పొందిన రైతు కుటుంబాల్లో 51లక్షల మంది భూ యజమానులు కాగా, 3లక్షల మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ ఇతర ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారున్నారు.

ఖరీఫ్‌ తొలి విడత సాయం మే 13న..
ఈ ఏడాది ఖరీఫ్‌ తొలి విడత సాయాన్ని మే 13న అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గత నెల 22 నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఆర్‌బీకే స్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఇందులో అర్హులై ఉండి గతంలో లబ్ధిపొందని వారిని గ్రీవెన్స్‌ పోర్టల్‌లో పొందుపర్చారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి అనుసంధానం కాని ఖాతాలు కలిగిన రైతులను సంబంధిత బ్యాంకుల ద్వారా అనుసంధానించేందుకు అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హులై ఉండి ఇంకా లబ్ధిపొందని వారు ఎవరైనా ఉంటే వారి కోసం ఏప్రిల్‌ 30 వరకు గడువునిచ్చారు. తుది జాబితాను మే 10న వెల్లడిస్తారు. 

అర్హులు సద్వినియోగం చేసుకోండి
వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఇప్పటివరకు అర్హత పొందని అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్‌ 30లోగా ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు అర్హత పొందిన వారి జాబితాలను ప్రదర్శిస్తున్నారు. వారిలో అనర్హులను గుర్తించి తెలియజేస్తే వారికి లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకుంటాం.
– హెచ్‌ అరుణ్‌కుమార్, కమిషనర్‌ వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు