తూర్పు వైపు స్వాముల చూపు

26 Nov, 2021 16:33 IST|Sakshi

రైళ్ల రద్దుతో శబరిమలై యాత్రకు ఆటంకం  

మండపేట: తిరుపతి, చెన్నైలో భారీ వర్షాలు శబరి యాత్రపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల ట్రాక్‌ దెబ్బతిని నెల్లూరు, చెన్నై మీదుగా కేరళ వెళ్లే రైళ్లు రద్దవ్వడంతో ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన అయ్యప్ప మాలధారులు జిల్లాకు తరలివస్తున్నారు. ఆంధ్రా శబరిమలైలుగా ప్రసిద్ది చెందిన ద్వారపూడి, శంఖవరంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు స్వాములతో కిటకిటలాడుతున్నాయి. 

మండల దీక్షను పూర్తిచేసుకున్న అనంతరం ఇరుముడులు సమర్పించుకునేందుకు అధికశాతం మంది శబరిమలైకి వెళుతుంటారు. ముందుగానే రైలు టిక్కెట్లు కూడా రిజర్వేషన్లు చేయించుకుంటారు.  కొద్ది రోజులుగా తిరుపతి, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  శబరిమలై వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సన్నిధానానికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎక్కువ మంది స్వాములు మన జిల్లాకు తరలివస్తున్నారు.  

వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి రోజు వందలాదిగా తరలివస్తున్న స్వాములతో ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్ప ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ఆన్నప్రసాదంతో పాటు ఉండేందుకు వసతి సదుపాయాలు ఉండటంతో మాలధారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ద్వారపూడి ఆలయంలో రోజు దాదాపు 3000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా శబరిమలై వెళ్లలేని స్వాములు జిల్లాకు వచ్చి ఇరుముడులు సమర్పించుకుంటుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివస్తున్న స్వాములతో సందడి నెలకొంది. శబరిమలై వెళ్లలేకపోయినా జిల్లాలోని ఆలయాల దర్శనంతో మంచి అనుభూతి కలుగుతోందని స్వాములు అంటున్నారు. భక్తిశ్రద్దలతో స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకుని, నేయ్యాభిషేకం, మాళిగాపురత్తమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. మాలవిసర్జన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగుపయనం అవుతున్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.

శబరిమలై వెళ్లలేక 
శబరిమలై వెళ్లేందుకు రెండు నెలల క్రితమే ట్రై న్‌కు టిక్కెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్నాం. భారీ వర్షాలతో రైళ్లు రద్దు కావడంతో ఆంధ్రాశబరిమళైగా పేరొందిన ద్వారపూడి వచ్చాం. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. 
పి. కృష్ణాంజనేయులు, గండుబోయినపల్లి, చిత్తూరు జిల్లా

ఆలయాలు చాలా బాగున్నాయి 
ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్పస్వామివారి ఆలయాలు చాలా బాగున్నాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీలు మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడే స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకున్నాం. 
టి. సత్యనారాయణ, గుండుగొలను, పశ్చిమగోదావరిజిల్లా 

మరిన్ని వార్తలు