ఆర్‌బీకేల్లోనే గోనె సంచులు 

25 Nov, 2022 19:13 IST|Sakshi

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.35 కోట్ల సంచులు అవసరం

6.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

కొనుగోళ్ల ప్రక్రియ పర్యవేక్షణకు ఆర్‌బీకేకు ముగ్గురు అధికారులు

రీసైక్లింగ్‌ విధానంతో గోనెసంచుల సమస్య పరిష్కారం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు సంక్షేమమే థ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తు దగ్గర నుంచి కోత కోసే వరకు అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. రైతు పంటకు మద్దతు «ధర దక్కేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎక్కడా నష్టపోకుండా ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.  

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు రెండు జిల్లాల అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా రైతులకు  రైతుభరోసా కేంద్రాల ద్వారానే  ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల వద్ద వలంటీర్లు, రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్ళకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ళల్లో రైతు సంఘాల నేతలు, రైస్‌మిల్లర్లు, రైతులతో జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.  

గోనెసంచుల కొరతతో ఇబ్బందులు 
ఈ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోనెసంచుల కొరత అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటికి ఇబ్బందులు ఏర్పడకుండా గోనెసంచులు భారీ ఎత్తున అందించేందుకు అ«ధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ఆరంభంలో గోనెసంచుల కొరత ఏర్పడినప్పటికీ దానిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోనె సంచులను రైస్‌మిల్లర్ల నుంచి రైతులకు అందించేందుకు రెండు జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో గోనెసంచులు అందుబాటులో ఉండేలా మిల్లర్లు గోనెసంచులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆరంభంలో మిల్లర్లు  గోనెసంచులు అందించడంలో కాస్త అశ్రద్ధ వహించినప్పటికీ క్రమేపి రైతు భరోసా కేంద్రాలకు గోనెసంచులు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు.  

మిల్లర్ల సాయంతో గోనెసంచుల సేకరణ
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 745 రైతుభరోసా కేంద్రాల్లో 4.2 లక్షల  మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 296 రైతుభరోసా కేంద్రాల పరిధిలో 3.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి ఏలూరులో 1.50 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 85 లక్షలు గోనెసంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటికి అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు ఏలూరు జిల్లాలో 95 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 60 లక్షలు గోనెసంచులు అవసరం కానున్నాయి. వీటిని రైతులకు అందుబాటులో ఉన్న రైతుభరోసా కేంద్రాలకు మిల్లర్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ప్రస్తుత ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో గోనెసంచులు భారీగా అవసరమయ్యాయి. గోనెసంచుల విషయంలో అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గోనెసంచులను రీసైక్లింగ్‌ విధానం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ చేస్తున్నారు. కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలుకు అధికారులు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్‌బీకేల వద్ద వీఆర్‌ఓ, ఆర్‌ఐలను కస్టోడియన్లుగా నియమించి మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 120 నుంచి 180 వరకు వాహనాలను అందుబాటులో ఉంచి రవాణాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా 
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నాం. ఆరంభంలో గోనెసంచుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అ«ధిగమించి రైతులకు గోనెసంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.  
– వె.ప్రసన్నవెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్‌  

గ్రామస్థాయిలోనే రైతులకు సేవలు   
గ్రామ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు సేవలందిస్తున్నాను. ప్రస్తుతం కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో గోనెసంచులు ఉంచి కొనుగోలు నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాము. రైతుభరోసా కేంద్రాల్లో  ధాన్యం కొనుగోలుకు అ«ధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు.  
– పి.ప్రశాంతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌

మరిన్ని వార్తలు