ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు 

15 Sep, 2022 03:51 IST|Sakshi
మాట్లాడుతున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణారెడ్డి

జల్‌ జీవన్‌ మిషన్‌ అమలుకు ప్రత్యేక కార్యాచరణ 

యునిసెఫ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఎన్‌జీవోలకు శిక్షణ 

విజయవాడలో ప్రారంభించిన అధికారులు

సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్‌.వి.కృష్ణారెడ్డి, తాగునీరు– పారిశుధ్యం ప్రాజెక్టు డైరెక్టర్‌ హరిరామ్‌ నాయక్‌ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుతో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్‌జీవోలతో కలిసి గ్రామాల్లో మంచినీరు, ఇంటింటికి నీటి కుళాయిల ప్రాధాన్యంపై ప్రచారం చేయనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన ఎన్‌జీవో ప్రతినిధులకు యునిసెఫ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ తరగతులను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. మాస్టర్‌ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వీరు జిల్లాల వారీగా మరికొందరికి శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల కోట్ల ఖర్చుతో అన్ని గ్రామాల్లోను ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు మురుగు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపు నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఎన్‌జీవోలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని యునిసెఫ్‌ అందిస్తున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు