ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం

25 May, 2022 16:09 IST|Sakshi

ఆయిల్‌పామ్‌ వైపు.. రైతుల చూపు

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం 

ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట 

భీమిలి డివిజన్‌లో 200 ఎకరాల్లో సాగు 

తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్‌పామ్‌ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్‌లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్‌ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్‌ గెలలను తరలిస్తున్నారు. 

మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ 
సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్‌పామ్‌ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా  రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. 

పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత 
ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. 

అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 
2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్‌పామ్‌ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్‌ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్‌పామ్‌ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్‌ సమస్య లేదు.
– కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం

పక్షుల బెడద ఉంటుంది  
ఆయిల్‌పామ్‌కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్‌పామ్‌ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్‌పామ్‌ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. 
– మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం

మరిన్ని వార్తలు