సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే: సజ్జల

31 May, 2023 14:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలాటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. 

జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు
జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్‌, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు.

తప్పుడు ఆరోపణలు
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఓ వర్గం మీడియా తమ సొంత అజెండాతో దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలి. టీవీ ఛానళ్ల డిబేట్లలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజాయితీపరులపై అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్

జగన్‌దే తుది నిర్ణయం
వైఎస్‌ జగన్‌ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్‌ ఆహ్వానించారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్‌దే తుదినిర్ణయం. ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనేది జగన్‌ ఇష్టం. వివేకా హత్య కేసు విషయంలో రాజకీయం కోణం ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరిని అడిగిన ఆ విషయం చెప్తారు. 

ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు
లేఖను దాచిపెట్టాలని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. కేవలం ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వివేకా హత్య వెనక ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో దర్యాప్తు జరపడం లేదు. కీలక అంశాలపై సీబీఐ విచారణ చేపట్టలేదు. టీడీపీకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ప్రతికూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం ఓడినట్టా? చివరకు న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

కాగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది.

మరిన్ని వార్తలు