ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్‌ తుది నిర్ణయం..

7 Jan, 2022 15:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం  పీర్సీని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. 

కాగా, అంతకు ముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, నిన్న(గురువారం) కూడా చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఈ రోజు సీఎం జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం పీఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్తితుల్లో సీఎం ది బెస్ట్‌ ఇస్తారని తెలిపారు.
చదవండి: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌ మరోసారి భేటీ

మరిన్ని వార్తలు