సీఎం జగన్‌ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల

13 Nov, 2022 21:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదన్నారు. గవర్నమెంట్‌కు రెవెన్యూ వ్యవస్థ అనేది నాడీ వ్యవస్థ లాంటిదని చెప్పారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఉద్యోగులపై విశ్వాసం ఉండడం వల్లే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చారిత్రాత్మకమైన సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి నుంచి కలగా మిగిలిపోయిన వాటిని చక్కదిద్దేపనిలో నిమగ్నమయ్యారు. ఎలాంటి లిటికేషన్లు, అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 71వేల ఎకరాలు పేదలకు పంచడం అంటే ఊహలకు కూడా అందని అంశం అని పేర్కొన్నారు.

'మూడున్నరేళ్ల పాలనలో కరోనా రెండేళ్లు ఇబ్బంది పెట్టింది. పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలు ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్‌ స్టేజ్‌కి వచ్చాయి. సీఎం జగన్‌ ఏం చేసినా ఎంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అనేదే ఆలోచిస్తారు. టీమ్‌ స్పిరిట్‌కి బేస్‌ క్రీడలు మాత్రమే. ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేలా క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

చదవండి: (CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్‌ జగన్‌!)

మరిన్ని వార్తలు