పార్టీ బాధ్యతల కోసం అందరూ సిద్ధం

10 Apr, 2022 03:18 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: పార్టీ బాధ్యతలు చేపట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసిన 24 మంది మంత్రుల్లో ఏ ఒక్కరిలోనూ అసంతృప్తి లేనే లేదని, అదంతా ఎల్లో మీడియా సృష్టే అని స్పష్టం చేశారు.  వాస్తవానికి పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లోనూ ఇదే రీతిలో ఘన విజయం సాధించడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన రోజునే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రులుగా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు.

ఇందులో భాగంగానే మొన్న మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారని చెప్పారు. తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తామని వారంతా ముక్త కంఠంతో తెలిపారన్నారు. ప్రస్తుత మంత్రుల్లో ఏడు నుంచి పది మంది లేదా ఐదుగురిని.. అనుభవం, సామాజిక సమీకరణాలు, జిల్లాల అవసరాల దృష్ట్యా కొనసాగించే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల్లో అసంతృప్తే లేనప్పుడు.. ఎవరిని బుజ్జగిస్తామని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ టీమ్‌లో సభ్యులేనని.. అందులో ఎవరికైనా మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చునని చెప్పారు.

మంత్రివర్గం కూర్పుపై ఆదివారం మధ్యాహ్నం వరకు సీఎం జగన్‌ కసరత్తు చేస్తారని, ఆ తర్వాత కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారన్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కిన వారికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఆ తర్వాత కొత్త మంత్రులు, అతిథులకు తేనీటి విందు ఉంటుందని తెలిపారు.     

మరిన్ని వార్తలు