సీఎం జగన్‌ నిజమైన గాంధేయవాది

31 Jan, 2021 04:48 IST|Sakshi
గాంధీజీ వర్థంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న సజ్జల. చిత్రంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు

గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టి.. గాంధీ తత్వాన్ని ఆచరించి చూపించారు 

ప్రశాంతతతోనే పల్లెల్లో గ్రామ స్వరాజ్యం సాధ్యం 

అందుకే పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు సర్కారు ప్రోత్సాహం  

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాయకులు మాటలకే పరిమితమైనప్పటికీ మహాత్మాగాంధీ తత్వాన్ని చేతల్లో చేసి చూపిన నిజమైన గాంధేయవాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తన ప్రతి చర్యలోనూ గాంధేయవాదాన్ని ఆచరించి చూపారని తెలిపారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా సరిగ్గా గాంధీ ఆలోచనా విధానంతోనే పచ్చని పల్లెల ప్రగతిని కాంక్షిస్తూ, కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఏకగ్రీవాలు జరగాలని ఆయన కాంక్షిస్తున్నారన్నారు.  

సీఎం చరిత్రలో నిలిచిపోతారు: ఉమ్మారెడ్డి 
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు గతంలో ఎవ్వరూ పరిపాలనను గ్రామస్థాయికి తీసుకెళ్లే సాహసం చేయలేదన్నారు. ఇప్పుడు అలా చేసిన ఏకైక సాహసికుడు సీఎం జగన్‌ అని వెల్లడించారు. పరిపాలనను గ్రామస్థాయి నుంచి గడప స్థాయికి తీసుకెళ్లి ప్రజల ముంగిటకే పథకాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. గాంధీజీ సూత్రాలు, ఆలోచనా విధానాన్ని అనుసరిస్తున్న సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఈదా రాజశేఖర్‌ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎన్‌ పద్మజ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు