అట్టడుగు వారికీ ఫలాలు: సజ్జల రామకృష్ణారెడ్డి

23 Jul, 2021 02:35 IST|Sakshi

ఇదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం 

ఈ ఆశయసాధనలో మేధావులు  భాగస్వాములవ్వాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల పిలుపు

ప్రజల్లో చైతన్యం పెంచి ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టాలి

ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలకు సృజనాత్మకంగా వివరించాలి: మేధావులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కులమతాలు, పార్టీలకతీతంగా పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్‌ జగన్‌ నడుం బిగించారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ద్వారా పూర్తి స్థాయి అభివృద్ధికి సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయిలో ఆఖరి వ్యక్తికి కూడా అందాలన్నదే సీఎం ఆశయమని వివరించారు.

ఈ ఆశయసాధనలో మేధావులు కూడా భాగస్వాములై.. తమ వంతు చేయూత అందించాలని కోరారు. అలాగని జగన్‌ పాలనకు జై కొట్టాలని మిమ్మల్ని కోరడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాత్రమే కోరుతున్నామని సజ్జల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి– మేధావుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు చెందిన అన్ని రంగాల మేధావులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

ప్రతి ఒక్కరూ వారి కాళ్లపై వారు నిలబడేలా..
నూతన సమాజ స్థాపన దిశగా సరికొత్త ఒరవడితో సీఎం జగన్‌ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రత్యేక పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. వీటిని వాడుకుని ఎదగాలనే కాంక్ష ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. జగన్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చరిత్రలో ఎక్కడా లేని విధంగా లక్షా 30 వేల రెగ్యులర్‌ ఉద్యోగాలిచ్చి జాబ్‌ క్యాలెండర్‌ కూడా ప్రకటించారు. అయితే బాధ్యత లేని ప్రతిపక్షం సీఎం ఇంటిని ముట్టడించాలంటూ యువతను రెచ్చగొడుతోంది. మీడియా అండదండలతో ప్రతిదాన్నీ రాజకీయం చేసి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలన్న ఏకైక మైండ్‌గేమ్‌తో ముందుకు సాగుతోంది. సహేతుక విమర్శలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దుర్బుద్ధితో చేసే కువిమర్శలను తిప్పికొట్టేందుకు మేధావులు సిద్ధంగా ఉండాలి. 

సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు..
ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ పి.విజయప్రకాష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు జరుగుతోందని తెలిపారు. ఇది ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ ఎం.పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మేలును సృజనాత్మకంగా ప్రజలకు వివరించాలన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచి ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.

ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించడానికి నియోజకవర్గాలవారీగా సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ అండ్‌ సీఈవో డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, జనచైతన్యవేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ పి.విజయబాబు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ప్రొఫెసర్‌ జ్ఞానమణి, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నాగేశ్వరరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు