పండుగలా ప్రజా చైతన్య కార్యక్రమాలు 

5 Nov, 2020 05:29 IST|Sakshi

ఈనెల 6నుంచి 10 రోజులపాటు నిర్వహణ 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 6 నుంచి 10 రోజుల పాటు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాలను ఒక పండుగలా నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ‘ముఖ్యమంత్రి జగనన్న విజయగీతం’ పేరుతో భరత్‌కుమార్‌ రూపొందించిన పాటల సీడీని, ‘జననేత పాదయాత్రకు మూడేళ్లు’ పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017 నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర రాష్ట్రంలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్ల మేర 14 నెలలపాటు ఇచ్ఛాపురం వరకూ సాగిందన్నారు. ఎండనక, వాననక.. జనంలో తాను ఒకడిగా తిరిగారని గుర్తు చేశారు.

రాత్రిపూట గుడారాల్లో బస చేస్తూ.. ఒకవైపు పార్టీని నడుపుతూనే మరోవైపు భవిష్యత్‌ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించుకుంటూ.. ఇంకోవైపు ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ఒక మహాయజ్ఞం తరహాలో సీఎం జగన్‌ ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. బహుశా ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా వైఎస్‌ జగన్‌ ఒకే జాబితాలో 175 మంది అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను, 25 మంది పార్లమెంటరీ అభ్యర్థులను ప్రకటించడం చూశామని.. ఇదీ ఒక చరిత్రేనని కొనియాడారు.

మొదటి 14 నెలలు జనంలో ఉండి.. మరో 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల కోసమే పూర్తిగా అంకితం అవుతూ పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి, పద్మజ, ఎ.నారాయణమూర్తి, పార్టీ కార్యదర్శి బసిరెడ్డి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు