జర్నలిజంలో ఘనాపాటి ‘తుర్లపాటి’

25 Jan, 2021 05:09 IST|Sakshi
తుర్లపాటి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సజ్జల, మోపిదేవి, మల్లాది విష్ణు

పటమట (విజయవాడ తూర్పు): దేశ స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అందరికీ ఆదర్శప్రాయుడని ప్రభుత్వ  సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ గురునానక్‌ కాలనీలోని స్వర్ణ కల్యాణ మండపంలో తుర్లపాటి కుటుంబరావు సంస్మరణ సభ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1990–92 మధ్య ఉదయం దినపత్రికలో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు తుర్లపాటిని కలిశానని, సమాజంలో అనేక కోణాలను తుర్లపాటి ఆవిష్కరించేవారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా తుర్లపాటి విలువైన సలహాలిచ్చేవారని వివరించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో నేరుగా మాట్లాడే వ్యక్తుల్లో తుర్లపాటి ఒకరని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ తుర్లపాటి ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండేవని, రాజకీయాలకు అతీతంగా ఆయన అందరితో సంబంధాలను కలిగి ఉండేవారని అన్నారు. అసెంబ్లీ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ తుర్లపాటి  10వేలకు పైగా సభల్లో ఉపన్యాసాలిచ్చి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించారన్నారు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్ట్‌ తుర్లపాటి అని కీర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ..  తెలుగుదనానికి ఆయన బ్రాండ్‌గా ఉండేవారన్నారు. అంతకుముందు సావిత్రి కళాపీఠం తుర్లపాటి జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్మరణ సభలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్, మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పవరపు మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్‌ బాబురావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు