పూలింగ్‌.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్‌

27 Mar, 2021 04:01 IST|Sakshi

చంద్రబాబు నేతృత్వంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: సజ్జల రామకృష్ణారెడ్డి

పేదల భూములు కొల్లగొట్టారు 

దళితుల భూములను లాక్కున్నారు 

చంద్రబాబు, ఆయన బినామీలే లబ్ధి పొందారు

సాక్షి, అమరావతి: అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారం ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ సర్కారు పేదల భూములను బలవంతంగా లాక్కుందన్నారు. అసైన్డ్‌ భూములను బెదిరించి తీసుకుందని, చంద్రబాబు ఆయన బినామీలకే పెద్ద ఎత్తున మేలు చేకూరిందని ధ్వజమెత్తారు. సీఐడీ విచారణలో ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకరిద్దరిని ప్రలోభపెట్టి కేసే లేదని చెప్పడం పేదలకు అన్యాయం చేయడం కాదా? అని ప్రశి్నంచారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  

అమరావతిపై బాబు కపట ప్రేమ 
పేదల భూములు లాక్కున్నాక ల్యాండ్‌పూలింగ్‌లో మార్పులు చేస్తూ టీడీపీ సర్కారు జీవో 41 ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ నిందితులు. చంద్రబాబుకు అమరావతిపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ చెబుతూనే ఉంది. అదే ఉంటే విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని పెట్టేవారు. వేల ఎకరాలు దోచుకోవడం, భారీగా కూడబెట్టుకోవడమే చంద్రబాబు దురాలోచన. లాండ్‌పూలింగ్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. దీనిపై విచారణ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాం.   

ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలి? 
ఎవరినో బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించి సీఐడీ కేసు దాఖలు చేసిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం దారుణం. ఒకరిద్దరిని ప్రలోభపెట్టి స్ట్రింగ్‌ ఆపరేషన్‌ అని చెప్పుకోవడం దుర్మార్గం. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌తో అవినీతి బయటకు రాకుండా అడ్డుకోగలరా? పేదలకు చెందిన అసైన్డ్‌ భూములన్నీ చంద్రబాబు, తన బినామీదారులు రాయించుకున్న తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు మార్చారు. సీఆర్‌డీఏకు చంద్రబాబే చైర్మన్‌. ఆయన ఉద్దేశం మంచిదైతే ఆరు నెలల వ్యవధిలోనే ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమిటి? సీఐడీ విచారణలో 800 ఎకరాల వరకూ అసైన్డ్‌ భూములను చంద్రబాబు బినామీలు లాక్కుని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు  తేలింది. అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? ఇది కుంభకోణం అని చెప్పడానికి ఏ న్యాయవాద డిగ్రీలు కావాలి?    

వారే వచ్చి చెప్పాలా? 
కుంభకోణం జరిగిందని చెప్పడానికి ఫిర్యాదుదారుడు అవసరమా? మోసం జరిగిందని మోసానికి గురైన వారే వచ్చి చెప్పాలా? మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) ఎలా సాగుతున్నాయి? పేద రైతులను మోసగించిన మాట వాస్తవమే కదా? అందుకు ఎప్పటికైనా దోషిగా నిలబడక తప్పదు కదా? కొంతమంది గత సర్కారు జారీ చేసిన జీవో 41తో ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ని పోలుస్తున్నారు. ఇది పేదలకు ఇంటి స్థలాలిచ్చి పక్కా ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీవో. విశాఖలోనే దాదాపు 1.50 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించడం కోసం జీవో నెం.72 జారీ అయింది. బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్స్‌ జారీకి కారణాలను స్పష్టంగా చెప్పినా యనమల వక్రీకరించడం దారుణం.  

మరిన్ని వార్తలు