బీసీల్లో పేదరికాన్ని పోగొట్టేందుకే సంక్షేమ పథకాలు

24 Aug, 2021 04:43 IST|Sakshi
జంగమ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి

అసత్య ప్రచారం చేసే ఎల్లో మీడియా వీటి గురించి తెలుసుకోవాలి

బీసీల అభ్యున్నతికి సీఎం జగన్‌ విశేష కృషి చేస్తున్నారు

జంగమ కులస్తుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జంగమ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. జంగమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ వావిలేటి ప్రసన్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బీసీ కుటుంబంలో పేదరికాన్ని పొగొట్టేందుకు సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు రుణాలు ఇవ్వడం లేదంటూ ప్రచారం చేసే ఎల్లో మీడియా బీసీలకు అమలు చేస్తున్న పథకాలు గురించి తెలుసుకోవాలన్నారు. జంగమ కులస్తులు ప్రతి గ్రామంలోనూ ఉండి సంప్రదాయాల పరంగా అందరికి సేవలందిస్తుంటారని తెలిపారు.

చిన్న కులమే అయినప్పటికి.. వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ జంగమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. జంగమ కార్పొరేషన్‌.. ఆ కులంలో ఉండే ప్రతి సమస్యను పరిష్కరించి, వారి కులస్తులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జంగమ కార్పొరేషన్‌ కింద ఉన్న ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. కార్పొరేషన్‌ చైర్‌పర్సన్, డైరెక్టర్లు జిల్లాలవారీగా జంగమ కులస్తుల సమస్యలపై సమావేశాలు నిర్వహించి సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ, బీసీ మంత్రి దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని తెలిపారు.

శైవ క్షేత్రాల్లో జంగమ కులం వారిని పెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బీసీల సువర్ణ శకానికి సీఎం జగన్‌ నాంది పలికారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న, జంగమ కులస్తుల రాష్ట్ర నేతలు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు.   

మరిన్ని వార్తలు