Sajjala Ramakrishna Reddy: పవన్‌ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: సజ్జల

2 Oct, 2021 14:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎ‍మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి సజ్జల నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మాగాంధీ ఒక యుగపురుషుడు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థంలో గాంధీ సూక్తులు బోధించారు. కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిల్చారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో జగన్‌ పాలన గాంధీ ఆలోచనా రూపాన్ని ఆచరణలో పెట్టిన విషయం అర్థం అవుతుంది. గాంధీ మార్గంలో ప్రయాణించడానికి పునరంకితమవుదాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి' అని కోరారు. 

కోవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమే. ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే. అక్టోబర్‌లో కోవిడ్‌ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. పవన్‌ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. రోడ్ల గుంతలు మీరు పూడ్చడం ఏమిటి?. అందుకు సీఎం జగన్‌ రూ.2,200 కోట్లు కేటాయించారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మత్తులు చేస్తాం. ఈలోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. టీడీపీ హయాంలో రూ.800 కోట్లు ఇచ్చారు. వాళ్లు బిల్లులు ఇవ్వకపోతే మేము ఇచ్చాం. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పవన్‌ ఆనాడు ఏమయ్యారు? అప్పుడు ఎందుకు శ్రమదానం చెయ్యలేదు' అంటూ సజ్జల మండిపడ్డారు. 

చదవండి: (పవన్‌ చీప్‌ పబ్లిసిటీ మానుకోవాలి: సజ్జల)

మరిన్ని వార్తలు