ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

14 Oct, 2021 03:09 IST|Sakshi

వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి: సజ్జల

సంక్షేమాభివృద్ధి పథకాల అమలు బాధ్యత వారి భుజస్కందాలపైనే

ఉద్యోగులను సీఎం జగన్‌ తన టీమ్‌గా భావిస్తారు

అధికారంలోకి రాగానే వారంలోనే అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు

రెండేళ్లుగా కరోనాతో ఇబ్బందికరంగా ఆర్థిక పరిస్థితి 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ప్రక్రియ నెలాఖరులోగా కొలిక్కి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల ప్రధాన సమస్యలను వచ్చే నెలాఖరులోగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలో సీఎం కార్యాలయం అధికారులతో కలసి ఏపీ ఎన్జీవో, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల నేతలతో ఆయన సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగిందని సజ్జల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన కీలక బాధ్యత ఉద్యోగుల భుజస్కందాలపై ఉందన్నారు. ఉద్యోగులను తన జట్టుగా సీఎం జగన్‌ భావిస్తారన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత విషయంలో రెండడుగులు ముందుండాలన్నది సీఎం జగన్‌ విధానమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. దీనివల్ల ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వెనుకాడకుండా ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నాళ్లగానో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చి సిబ్బంది సమస్యలను సీఎం పరిష్కరించారన్నారు. 

త్వరలోనే అధికారిక చర్చలు
ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, కొత్తగా 1.30 లక్షల ఉద్యోగాలను కల్పించి పరిపాలనను వికేంద్రీకరించామని చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ఆ కారణంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిందన్నారు. పరిపాలన వ్యవహారాలు, సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో నిమగ్నం కావడం వల్ల సీఎం జగన్‌కు సమయం చాలడం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏ సమస్యతో వచ్చినా తాము పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు జరిగినవి అధికారికంగా జరుగుతున్న చర్చలు కావని, త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించే సమావేశమే అధికారికమని, అప్పుడు అన్ని సంఘాలను ఆహ్వానిస్తారన్నారు. ఉద్యోగ సంఘాల వ్యవహారాల్లో రాజకీయాలు చొప్పించాలని ప్రయత్నిస్తే ఫూల్స్‌ అవుతారన్నారు.  

మరిన్ని వార్తలు