అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం..

26 Jan, 2021 18:27 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక మార్పులు వచ్చాయని, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన, సంక్షేమ ఫలాలు ఇంటి ముందుకు వెళ్లాయని, అందుకే ఈ ఎన్నికల్లో తమకు అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిస్థితి అని పేర్కొన్నారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’

‘‘ప్రజాప్రతినిధుల పాత్ర కూడా అభ్యుదయ పాలనకు మెరుగులు దిద్దినట్టవుతుంది. రాబోతున్న సర్పంచ్‌లు పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఎవరూ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేని ఎన్నికలు ఇవి. ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే భవిష్యత్తులో అంత అభివృద్ధి జరుగుతుంది. పట్టుదలకు పోకుండా ఏకగ్రీవంగా ముందుకెళ్తే బాగుంటుంది.మేం అధికారంలోకి వచ్చాక పంచాయతీ స్థాయిని బట్టి ప్రోత్సాహకం పెంచాం. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం లేకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష. గ్రామ అభ్యుదయం, అభివృద్ధి, సంక్షేమం మా లక్ష్యం’’ అని సజ్జల తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికలు ఆపి పంచాయతీ ఎన్నికలు తేవడంపై దురుద్దేశాలు, ఏకగ్రీవాలు జరగకూడదు.. పోటీ ఉండాలనడంపై అనుమానాలున్నాయని.. దీని వెనుక టీడీపీ ఉందని తమకు అనుమానం ఉందన్నారు. పచ్చని పల్లెల్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్‌

‘‘ప్రతిపక్షం డబ్బు పంపిణీకి పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం. మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా చట్టం ఒక్కటే.అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా అనర్హులుగా చేస్తాం. ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు కావడంతోనే ఆపేశారని మేం భావిస్తున్నాం. టీడీపీ గెలిచే పరిస్థితి లేదు.. అందుకే ప్రలోభాలకు దిగుతున్నారు. ఏకగ్రీవాలకు వెళ్లాలని ఎన్నికల కమిషన్ చెప్పాలి.. కానీ ఆ ప్రయత్నం లేదు. ఏకగ్రీవాలపై కొరడా అంటున్నారు.. అందుకే ఆ బాధ్యత మేం తీసుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు