అంబులెన్స్‌లు నిలిపేయడం అన్యాయం

15 May, 2021 03:31 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సరిహద్దుల్లో సంయమనం అవసరం

వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లొచ్చు

తెలంగాణ మానవత్వంతో ఆలోచించాలి

అన్ని స్థాయిల్లోనూ ఆ రాష్ట్రంతో చర్చిస్తున్నాం

న్యాయ పోరుకూ వెనకాడేది లేదు

ఉమ్మడి రాజధాని వదులుకోవడంతో ఇక్కట్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైద్యం కోసం వెళ్తున్న రోగుల అంబులెన్స్‌లను తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో  నిలిపివేయడం సమంజసం కాదని, మానవీయ కోణంలో సరిహద్దుల్లో సంయమనం ప్రదర్శించాలని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు చెప్పినా.. అక్కడి ప్రభుత్వం సాంకేతిక కారణాలు అడ్డుపెట్టడం రోగుల ప్రాణాల మీదకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తెలంగాణతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృత్యువుతో పోరాడుతున్న రోగులను హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో చేర్చుకుంటామని భరోసా ఇస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామనడంలో అర్థం లేదన్నారు. చావు బతుకుల్లో ఇలాంటి నిబంధనల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కోర్టు జోక్యంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సజ్జల ఇంకేమన్నారంటే..

మానవత్వంతో చూడండి..
అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరగడం వల్ల మెరుగైన వైద్య సేవలన్నీ హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. చంద్రబాబు నిర్వాకం వల్ల పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశమూ పోయింది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అమరావతి పేరుతో భ్రమలు కల్పించాడే తప్ప.. వైద్య వ్యవస్థను బలోపేతం చేయలేదు. రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎందుకు నిర్మించలేదో ఆయన సమాధానం చెప్పాలి.  చంద్రబాబు నిర్వాకం వల్ల మన వాళ్లు వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో రోగులకు ఎప్పుడు వచ్చినా బెడ్‌ ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంటుందా? పేషంట్‌ ఆ సమయంలో అక్కడికి చేరితే, బెడ్‌ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దీనిని మానవత్వంతో చూడాలి. 

ఏపీ వైద్యానికి ప్రాధాన్యమివ్వండి
కరోనా రోగులు సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో వైద్యానికి ప్రాధాన్యమివ్వాలి. పరాయి రాష్ట్రాల్లోని  ఆసుపత్రిలో బెడ్‌ దొరుకుతుందో లేదో తెలియకుండా అక్కడికెళ్లి.. ప్రాణాలతో చెలగాటమాడుకోవద్దు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. ప్రజల ప్రాణాలు నిలబెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోంది. వైద్యాధికారులతో సీఎం రోజూ సమీక్షిస్తున్నారు. ఆక్సిజన్, మందుల కొరత రానివ్వకుండా, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచే దిశగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన సలహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.

వ్యాక్సిన్‌ను తెప్పించేందుకు ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లకు వెళుతోంది. దీనికి కేంద్రం అనుమతించాలి. ఆక్సిజన్‌ను 350 టన్నుల నుంచి 600 టన్నులకు పెంచుకున్నాం. కేంద్రం ఇచ్చిన కేటాయింపులను పెంచేలా చేశాం. ఆక్సిజన్‌ కొరత రాకుండా అధికారులతో కమిటీ వేశారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఇటువంటి సమయంలో మీడియా సహకారం చాలా కీలకం. వివిధ పథకాలతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటోంది. ఒక్క కోవిడ్‌ మీద రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

మరిన్ని వార్తలు