సామరస్య పరిష్కారానికి సీఎం జగన్‌ యత్నం

3 Jul, 2021 06:54 IST|Sakshi

అందులో భాగంగానే ప్రధానికి లేఖ

కేఆర్‌ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదు: సజ్జల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కేఆర్‌ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదని, అందుకే ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. వివాదం పరిష్కారం కావాలని, సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. తాడేపల్లిలో శుక్రవారం తనను కలిసిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానమిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అనుమానంగా ఉందన్నారు. అవసరమైతే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత, కేంద్రమే తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలని సీఎం జగన్‌ భావిస్తున్నారన్నారు. జల వివాదం పరిష్కారం కావాలని, సానుకూల నిర్ణయం రావాలనే సీఎం జగన్‌ ప్రధాన మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రికి లేఖలు రాశారని వివరించారు.   

కేసీఆర్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో!: రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా తానే ముందుండి అన్యాయం జరగకుండా చూస్తానని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌  ప్రోత్సహించారని సజ్జల గుర్తు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ఎత్తిపోతల లక్ష్యం అని తెలిపారు. సీఎం జగన్‌ ఇప్పుడు చేస్తోన్న ప్రయత్నాన్ని గతంలో కేసీఆర్‌  అంగీకరించి ప్రోత్సహించారన్నారు. రాయలసీమ కష్టాలు తనకు తెలుసని సీఎం కేసీఆర్‌ అన్నారని చెప్పారు. పరస్పరం 
ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలన్న కేసీఆర్‌ ఈ రోజున  ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదని సజ్జల వ్యాఖ్యానించారు. 

చట్టసభలు హుందాగా నడవాలన్నది సీఎం ఆకాంక్ష 
చట్టసభలు సమతుల్యత పాటిస్తూ, సభ హుందాతనాన్ని కాపాడుతూ నడవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటినుంచీ కోరుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున అధ్యక్షతన శుక్రవారం తాడేపల్లిలో శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యంకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. శాసనమండలిని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. అందుకే రాజకీయాలకు అతీతంగా విఠపు బాలసుబ్రహ్మణ్యంను శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా సీఎం ఎంపిక చేశారని చెప్పారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి విద్యాపరమైన ఆలోచనలు, విద్యారంగంలో సంస్కరణలు మొదలవడం సంతోషించదగిన పరిణామమని పేర్కొన్నారు.  శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, కత్తి నరసింహారెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, పోతుల సునీత, షేక్‌ సాబ్జి, మోషేన్‌రాజు, కరీమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కిలారి వెంకట రోశయ్య, మహ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరి  మాట్లాడారు. 

మరిన్ని వార్తలు