ప్రజలకు మేలు చేయడమే అజెండాగా ప్లీనరీ

7 Jul, 2022 04:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

రెండో ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌ 

సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు 

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారు? 

సాక్షి, అమరావతి: ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, ప్రజలకు మేలు చేయడమే ఏకైక అజెండాగా ప్లీనరీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 జూలై 8, 9వ తేదీల్లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రెండో ప్లీనరీలో పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించి.. ప్రజలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిందని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేశారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

చెప్పినదాని కంటే అధికంగా మేలు  
► నవరత్నాల్లో ఇచ్చిన హామీల కంటే సీఎం జగన్‌ అధికంగా మేలు చేశారు. పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో అమ్మ ఒడి ప్రకటించారు. నాడు–నేడు కింద రూ.16,450 కోట్లతో పాఠశాలలను ఆధునికీకరించారు.  విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.  
► 2014 ఎన్నికల్లో చంద్రబాబు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను మోసం చేస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 
► 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 % పైగా స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో 2019లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో గెలిపించారు. 
► రెండో ప్లీనరీలో ఇచ్చిన హామీలను సమీక్షించి.. వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడంపై మూడో ప్లీనరీలో చర్చిస్తాం. వచ్చే ఎన్నికలలోగా  ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తాం.

సామాజిక న్యాయానికి కట్టుబడే..  
► మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయంలో దేశానికే దిక్సూచిలా నిలిచారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని స్వాగతించి, మద్దతు ఇచ్చాం. 
► ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మద్దతు ఇచ్చేవారు కాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇవ్వడంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారు? దానిపై ఎల్లో మీడియా ఎందుకు నిలదీయడం లేదు? 
► రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపైనే ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలపై బీజేపీని వ్యతిరేకించాం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం.  

మరిన్ని వార్తలు