నారాయణ లీక్స్‌: బురద జల్లాలనుకున్నారు.. వాళ్లే దొరికిపోయారు-సజ్జల

10 May, 2022 17:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది అనేది నమ్మే వ్యక్తి వైఎస్‌ జగన్ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు చేసిన ప్రయత్నం.. వాళ్లకే బెడిసి కొట్టిందని ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టెన్త్‌ పేపర్ల లీకేజ్‌ పరిణామాలపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. 

‘‘పది పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఎప్పుడూ జరగని విషయం అన్నట్లు చంద్రబాబు మాట్లాడారు. కానీ, ఇవాళ దీనికి ప్రధాన కారణమైన వాళ్ల పార్టీ నాయకుడు నారాయణనే అరెస్ట్ అయ్యారు. నారాయణ సంస్థ ప్రమేయంతో లీక్ వ్యవహారం ప్రారంభం అయ్యిందని దృష్టికి రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కానీ, ప్రభుత్వంపై బురద జల్లడానికి వాళ్లు(టీడీపీ) ప్రయత్నం చేస్తే.. ఈ రోజు వాళ్లే దొరికిపోయారు. 

రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి వ్యవహారం బద్దలైంది.. అరెస్టులు జరిగాయి. మాస్ కాపీయింగ్, పేపర్లు లీక్ కు స్పెషలిస్టులుగా మారిపోయారు వాళ్లు. చదువుకుని పోటీ తత్వంతో పిల్లలు ఎదగాలి తప్ప ఇలా అడ్డదారుల్లో కాదని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ వ్యవహారం వెనుక ఉన్న తీగలాగింది. ఫలితం.. వారికి సహకరించిన వారి డొంక కదిలి దొరికిపోయారు.  ఇలాంటి వ్యక్తినా? చంద్రబాబు మంత్రిగా పెట్టుకుంది!. లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు అంటూ మాజీ మంత్రి, నారాయణ సంస్థల వ్యవస్తాపకుడు నారాయణపై మండిపడ్డారు సజ్జల. 

పరీక్ష పత్రాల లీకేజ్‌ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రతిపక్షం ‘ఇదంతా రాజకీయ కక్ష సాధింపు’ అంటుందని ముందే ఊహించాం. కానీ, నిందితులు ఎవరైనా సరే కఠినంగానే వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఎవర్నీ అన్యాయంగా, అక్రమంగా పోలీసులు అరెస్టులు చేయలేదు. చట్టం ముందు అంతా సమానమే. పూర్తి పారదర్శకంగా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సమీప బంధువు కొండారెడ్డిపై ఆరోపణలు వచ్చినా.. సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది అనేది నమ్మిన వ్యక్తి జగన్. అది నారాయణ కావచ్చు.. కొండారెడ్డి కావొచ్చు.. విషయం ఏంటన్నది విచారణలో తేలుతుంది. దీన్ని కక్ష సాధింపు అంటే ఎవరూ ఒప్పుకోరు.  పైగా ఇటువంటి నేరాన్ని(పేపర్‌ లీకేజీ) వ్యవస్తీకృతం చేసిన వ్యక్తి నారాయణ. గతంలో వనజాక్షి విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనవాళ్ళని మందలించకుండా నిస్సిగ్గుగా రాజీ చేశారు. బొండా ఉమా కొడుకు కారు యాక్సిడెంట్ చేస్తే కేసు కూడా లేదు. ఇవన్నీ భరించలేకే ప్రజలు.. వాళ్ళని(టీడీపీని ఉద్దేశించి..) చెత్తబుట్టలో పడేశారు అన్నారు సజ్జల.

చదవండి👉:  నాలుగు రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలో నారాయణ!

మరిన్ని వార్తలు