సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల

14 May, 2021 13:45 IST|Sakshi

మానవతా దృక్పధంతో అంబులెన్స్‌లను అనుమతించాలి

సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇది జాతీయ విపత్తు.. దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేస్తోందన్నారు. మానవతా దృక్పథంతో అంబులెన్స్‌లను అనుమతించాలని ఆయన కోరారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా ఆ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టడం సరికాదన్నారు.ఆస్పత్రి లెటర్‌, పాస్‌లు తీసుకురావడం సాధ్యం కాదని తెలిపారు.

‘‘మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లడం సహజం. గత ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయలేదు. ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దుల్లోనే వస్తుంది. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మాకు ఇబ్బంది కలిగించడం లేదు. హైదరాబాద్‌ 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది. బాబు రాష్ట్రానికి వచ్చేయడంతో మేం ఆ అవకాశాన్ని కోల్పోయాం. అంబులెన్స్‌ల అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని’’ సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

చదవండి: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత
YS Jagan: సీఎం జగన్‌ లేఖతోనే కదలిక 

మరిన్ని వార్తలు