ప్రభుత్వ పథకాలపై ప్రచార రథం

30 Dec, 2021 04:50 IST|Sakshi

మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు 

ప్రచార రథాన్ని ప్రారంభించిన సజ్జల  

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథాన్ని బుధవారం ఆయన తాడేపల్లిలో జెండా ఊపి  ప్రారంభించారు. నవరత్నాల ప్రయోజనాలను తెలియచేసేందుకు ప్రచార రథం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను వినియోగించుకునే?ందుకు ఇలాంటి ప్రచారం అవసరమని చెప్పారు. రథాన్ని రాష్ట్రం అంతా తిప్పి అందరినీ జాగృతం చేయాలని కోరారు.  

సంతృప్త స్థాయిలో ప్రయోజనం.. 
ఓట్ల కోసం కాకుండా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. ఓటీఎస్‌ ప్రయోజనాలపై ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఓటీఎస్‌ లబ్ధిదారులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పెద్దిపోగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు