రిపబ్లిక్‌ టీవీపై సజ్జల మండిపాటు

8 Mar, 2021 22:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ అయిన రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన ఫైరయ్యారు. మార్చి 4న జగన్‌ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు.

నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైఎస్సార్సీపీపై తప్పుడు కధనాలు బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీలో ఎలాంటి సంక్షోభం కానీ గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు.

చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని ఆయన ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలు ప్రసారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్‌గజపతిరాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలను వదిలి పెట్టి ఫేక్ కథనాలను వండి వారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో తెలుగు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. నిత్యం వివాదాల్లో ఉండే అర్నాబ్ జాతికి పట్టిన పీడ అని ధ్వజమెత్తారు.
 

మరిన్ని వార్తలు