బీసీల అభ్యున్నతికి పునరంకితమవుతాం: సజ్జల

28 Nov, 2020 11:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమసమాజం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సంస్కరణలు తీసుకువస్తున్నారని పార్టీ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్లొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరింత నిర్మాణాత్మకంగా బీసీల అభ్యున్నతికి పునరంకితమవుతామని తెలిపారు. ఈ ఏడాదిన్నర కాలంలో బీసీలను బాక్‌బోన్ కులాలుగా మార్చామని తెలిపారు. దానిలో భాగంగా 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వారికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. వచ్చే మూడేళ్లలో కూడా బీసీలను ముందు వరుసలో నిలుపుతామని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సముచిత స్థానం కోసం పాటుపడ్డ మహనీయుడు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో జ్యోతిరావు పూలేగా బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో​ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, గుమ్మనూరు జయరామ్, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, కాపు రామచంద్రారెడ్డి, విజయవాడ సిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరమిరెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణమూర్తి, ఈదా రాజాశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సాక్షి, పశ్చిమ గోదావరి: ఏలూరు వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతి రావు పూలే 130వ వర్దంతి వేడుకల్లో ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని పాల్గొన్నారు. ఆయన జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. బీసీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 56 బీసీ కార్పొరేషన్స్‌ ఏర్పాటు చేసి బీసీల పక్షపాతిగా నిలిచిన దేశంలోనే ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

సమాజంలో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయం కృషితో దేశానికీ పూలే వెలుగు దివ్వె అయ్యారని గుర్తుచేశారు. మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్ని బట్టి కాదని, పూలే జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. మూఢ నమ్మకాలను తొలగిస్తే తప్ప ప్రజలు చైతన్యవంతులు కారని జ్యోతి రావు పూలే ఉద్యమించారని పేర్కొన్నారు. స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వితంతువులు కష్టాలను చూసి పూలే చలించిపోయారని మంత్రి ఆళ్లనాని గుర్తుచేశారు.
 

మరిన్ని వార్తలు