హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల

16 Sep, 2021 12:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌  ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్‌ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. 

గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అ​ప్పటికే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

చదవండి:  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్‌ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు