గుంటూరులో వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంకులు ప్రారంభం

12 Jul, 2021 08:56 IST|Sakshi
ఫుడ్‌ బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌ను పరిశీలిస్తున్న మేయర్‌ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరి, ఫుడ్‌ బ్యాంకుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు

సాక్షి, నెహ్రూనగర్‌(గుంటూరు): ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార వృథాను అరికట్టి అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో ఆరుచోట్ల వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకుల్లో ఫ్రీజ్‌ లను అందుబాటులో ఉంచింది. ఆహారం సేకరించి వీటిల్లో నిల్వ చేసి భోజనానికి ఇబ్బంది పడే పేదల పొట్ట నింపనుంది.  సోమవారం ఈ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

వెయ్యిలీటర్ల సామర్థ్యంతో..  
నగరంలో రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్టాండ్, జీజీహెచ్, లాడ్జిసెంటర్, గాంధీ పార్కు, చుట్టుగుంట ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫుడ్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఫ్రిజ్‌లలో నాజ్‌వెజ్, వెజ్‌కు విడివిడిగా ర్యాక్‌లు ఉంటాయి. మిగిలి పోయిన ఆహారాన్ని ఈ ర్యాక్‌లలో ఉంచితే సరిపోతుంది. ఈ బ్యాంకుల నిర్వహణకు అధికారులు రెండు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. వీరు దాతల నుంచి ఆహారాన్ని సేకరించి ర్యాక్‌లలో నిల్వ చేస్తారు. అన్నార్తులు వస్తే వారికి భోజనాన్ని అందిస్తారు. ఈ ఫుడ్‌ బ్యాంకులపై విస్తృత ప్రచారం చేసేందుకూ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఈ విధానం గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలవుతోంది.   

పాతదుస్తులూ సేకరణ  
ఈ ఫుడ్‌ బ్యాంకుల్లో ఆహారాన్ని మాత్రమే కాకుండా పాత దుస్తులనూ సేకరిస్తారు. ఎవరైనా తమ పాత దుస్తులు ఇక్కడ అందజేస్తే ప్రత్యేక ర్యాక్‌లలో భద్రపరిచి అవసరం ఉన్నవారికి అందిస్తారు.
 
ఫుడ్‌బ్యాంకుల పరిశీలన   
వైఎస్సార్‌ ఫుడ్‌ బ్యాంకులను ఆదివారం మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు.   

మరిన్ని వార్తలు