నిజానికి, అబద్ధానికి మధ్య పోరాటం.. నిజం సీఎం జగన్‌ వైపు ఉంది.. : సజ్జల

31 Aug, 2022 05:22 IST|Sakshi
ౖౖవైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సజ్జల, మంత్రి అంబటి, పేర్ని నాని, తదితరులు

అబద్ధానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

దుష్టచతుష్టయం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ఇచ్చిన హామీలకంటే సీఎం జగన్‌ ప్రజలకు అధికంగా మేలు చేస్తున్నారు.. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి

సోషల్‌ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల పిలుపు

సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్‌: రాష్ట్రంలో నిజానికి, అబద్ధానికి మధ్య పోరాటం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ వైపు నిజం ఉంటే.. అసత్యాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు వైపు అబద్ధం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు అధికంగా మేలు చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం కార్యకర్తలకు ఉద్బోధించారు.

జగన్‌పై చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ టీవీ5 నాయుడుతో కూడిన దుష్టచతుష్టయం, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం తాడేపల్లిలో జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. ఈ మూడేళ్లలో చరిత్ర సృష్టించామని, చంద్రబాబు చేసిన అప్పులు, కోవిడ్, రాష్ట్ర విభజన నేపథ్యం, అభివృద్ధికి ఆస్కారం లేని పరిస్థితులలో ఎవ్వరూ చేయలేనంతగా రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేశారని వివరించారు.

రాజకీయం అంటే రాజకీయం కోసం కాదని, ప్రజల కోసమన్నది సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధాంతమని చెప్పారు. సంప్రదాయ పద్ధతులను బ్రేక్‌ చేస్తూ పాలనలో, వ్యవహార శైలిలో, పార్టీ వ్యవహారాలలో, నేతల శైలిలో కూడా మాటల్లో కాకుండా చేతలలో చూపిస్తున్నారని గర్వంగా చెప్పగలనన్నారు. మనం అందరం కాలర్‌ ఎగరేసుకుని చెప్పుకొనేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పారదర్శకత, స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌నెస్‌ వల్లే వైఎస్సార్‌సీపీకి విశ్వసనీయత వచ్చిందన్నారు.

సీఎం జగన్‌కు ఇంతలా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టే ధైర్యంగా ముందుకెళ్తూ.. మారీచులను ఎదుర్కొంటూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. అబద్ధాలను నిజమని, నిజాన్ని అబద్ధమని నమ్మించే వాళ్లు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారిని తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా వారిపై దృష్టి పెట్టి పనిచేయాలని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ మీడియానే సర్వస్వం అని భావించదని స్పష్టంచేశారు.

చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టే.. ప్రభుత్వంపై అడ్డంగా బురదచల్లుతూ ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. వాటిని కౌంటర్‌ చేయాలంటే మన పార్టీ సోషల్‌ మీడియా 2019లో పనిచేసిన విధంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధుసూధన్‌ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, శివశంకర్, పి.మధు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు