ఆ ఇళ్లు.. బడుగుల ఆత్మగౌరవ సౌధాలు 

13 Nov, 2022 04:01 IST|Sakshi
జక్కంపూడిలో జగనన్న ఇళ్లు

ఒకప్పుడు అవస్థలు, అగచాట్ల మధ్య పూరి గుడిసెల్లోనే దుర్భర జీవనం

గత ప్రభుత్వంలో ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోని వైనం

ఇప్పుడు వారి జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ ద్వారా స్థలాలు మంజూరు.. ఇళ్ల నిర్మాణం

కష్టాలుపడ్డ చోటే నేడు సొంతిళ్లలో ఆత్మగౌరవంతో జీవనం

విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామ జగనన్న కాలనీపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ 

ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే, పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లి తెలుసుకుంది. 

రోజంతా నా భర్త వెంకటేశ్వరరావు కూలికెళ్తే వచ్చే డబ్బు ఇద్దరు పిల్లల పెంపకం, కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో చాలాసార్లు అద్దె ఇంట్లోకి వెళ్దామనుకున్నా ఆర్థిక స్థోమత సహకరించక ఆ ప్రయత్నం విరమించుకున్నాం. గుడిసెల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు ధారలా కారుతుండేది. దీంతో పిల్లలను నేను, నా భర్త ఒళ్లో పడుకోబెట్టుకుని, పురుగు పుట్రా వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ బతికాం.

మా పరిస్థితి చూసి బంధువులెవరూ పెద్దగా ఇంటికి వచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడా అవస్థలు మాకులేవు. మేం ఉంటున్న గుడిసెలను ఖాళీ చేయించి ఇక్కడే మాకు ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇవ్వడమే కాక ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అందులో దర్జాగా ఉంటున్నాం. ఇదంతా తల్చుకుంటే నిజంగా కలలాగే ఉంది.

కేవలం మాకు గూడు కల్పించడమే కాదు.. నా బిడ్డల చదువుకు అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. అంతేకాక.. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.10వేల చొప్పున లబ్ధిపొందాను. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇంతలా సాయపడలేదు. మా బతుకు చిత్రాన్నే మార్చిన ముఖ్యమంత్రి జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. 
– కవిత, జక్కంపూడి, విజయవాడ రూరల్‌ మండలం 

పూరి గుడిసెల్లో ఉన్నప్పుడు ఏటా రెండుసార్లు పైకప్పు మార్చాల్సి వచ్చేది. ఇందుకు రూ.20వేలకు పైగానే ఖర్చయ్యేది. నా భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ నేను కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. కుటుంబ పరిస్థితులు సరిగాలేక నా కొడుకు పదో తరగతితో చదువు మానేసి ఫ్యాక్టరీలో పనికెళ్తున్నాడు.

అమ్మాయి ఇంటి వద్దే ఉంటుంది. దీనావస్థలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చి ఎంతో మేలు చేసింది. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.17 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. సున్నా వడ్డీ, ఇతర పథకాలు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాయి’’. 
– వి. పద్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్‌ మండలం

.. ఇలా ఎంతో మంది పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. 

టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు 
నా భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. మేం కూడా పూరి గుడిసెలో ఉండే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో స్థలం, ఇంటికోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు.

ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్‌ మంజూరైంది. పూరిగుడిసెల్లో ఉన్నపుడు వర్షం కారుతుండేది. పాములు, తేళ్లు కుట్టి ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పడు మాకంటూ ఒక ఇల్లుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతేకాదు.. మా కాలనీ వద్దకే రేషన్‌ బండి కూడా వస్తోంది. 
– అవనిగడ్డ లక్ష్మి, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్‌ మండలం

మా కష్టాలు తీరాయి..
నాకు పెళ్లి కాకముందు నుంచి నా భర్త కుటుంబం పూరి గుడిసెలో ఉంటోంది. నాకు ఇద్దరు పిల్లలు. బాలింతగా ఉన్న సమయంలో చలికాలం, వర్షాకాలం చిన్న పిల్లలతో గుడిసెలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఐదు, ఆరు మంది చిన్న గుడిసెలో ఉండేవాళ్లం. మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఉండటానికి ఇల్లులేక, అద్దెలు కట్టడానికి స్థోమత లేని మాలాంటి నిరుపేదల కష్టాలు అనుభవించే వారికే తెలుస్తుంది. జగనన్న పుణ్యమా అని మా కష్టాలన్నీ తీరాయి. సొంతింట్లో ఉంటున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. 
– వి. సీతమ్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్‌ మండలం

ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లింది. అక్కడి ఎస్టీ మహిళలతో మాట్లాడితే వారు పైవిధంగా స్పందించారు. అంతా కలలా ఉందని చెబుతుంటే వారి కళ్లల్లో ఎంతో సంతోషం సాక్షాత్కరించింది. 

 42 ఇళ్ల నిర్మాణం పూర్తి.. 
జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో పేదలకు 156 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 136 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే 42 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ 42 ఇళ్లలో 20కు పైగా ఇళ్లు గతంలో ఇక్కడే పూరిగుడిసెల్లో నివాసం ఉండే ఎస్టీలకు సంబంధించినవి. మరో 30 ఇళ్లు శ్లాబ్‌ దశ పూర్తయి ఫినిషింగ్‌ దశల్లో ఉన్నాయి.

మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం మార్కెట్‌ విలువ రూ.3 లక్షల మేర ఉంటుంది. ఇంత ఖరీదైన స్థలాలను  ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తోంది. ఉచితంగా ఇసుక, మార్కెట్‌ ధరల కన్నా తక్కువకు  నిర్మాణ సామగ్రి అందిస్తోంది. మూడు శాతం వడ్డీకి రూ.35వేల బ్యాంకు రుణాలు అందిస్తూ అదనపు సాయం సమకూరుస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేదలకు గూడు
జక్కంపూడి గ్రామానికి చెందిన ఎస్టీలు, ఇతర నిరుపేద కుటుంబాల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిలువ నీడలేని పేదలకు సీఎం జగన్‌ ప్రభుత్వం సొంత గూడు కల్పిస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30 లక్షల మందికి పైగా పేదలకు పక్కా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. 30.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జక్కంపూడి గ్రామంలోని ఎస్టీల తరహాలో ఇళ్లు నిర్మించుకునే స్థోమతలేని నిరుపేదల కోసం ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఇచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా 3.24 లక్షల మంది ఎంచుకున్నారు. లాభాపేక్ష లేకుండా ఈ ఇళ్లను నిర్మించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు 10–20 మంది లబ్ధిదారులను గ్రూప్‌గా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.  
(జక్కంపూడి జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్‌)  

మరిన్ని వార్తలు