ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్‌

13 Apr, 2022 11:24 IST|Sakshi

వాహన కాలుష్య నివారణే ప్రధాన లక్ష్యం

ప్రయోగాత్మకంగా తిరుపతిలో వంద విద్యుత్‌ బస్సులు

రవాణా శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు

రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది.

ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్‌ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి?
మంత్రి: డీజిల్‌ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా.

ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? 
జవాబు: ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను.

ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా?
జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్‌ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

ప్రశ్న: విద్యుత్‌ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు?
జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం.

ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి?
జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ– బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం.

ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్‌ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి?
జవాబు: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్‌ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను.

ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో?
జవాబు: ప్యాసింజర్‌ ఆటోలు, గూడ్స్‌ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను.

ప్రశ్న: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన?
జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. 

మరిన్ని వార్తలు