దళం వీడి పొలంలోకి

11 Oct, 2020 10:58 IST|Sakshi
నాగలి భుజాన వేసుకుని పొలం వెళుతున్న వాసన్న

అక్షర జ్ఞానం కోసం అన్నల వద్దకెళ్లా 

18 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేశా

నేడు సేద్యం చేసుకుంటూ బతుకుతున్నా

‘సాక్షి’తో మాజీ నక్సలైట్‌ వాసన్న

దళ కమాండర్‌గా ఉన్నపుడు తుపాకీ చేతబట్టాడు. దండకారణ్యంలో సంచరిస్తూ 18 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపాడు. అనారోగ్యంతో అడవి నుంచి బయటకు వచ్చి ఆసుపత్రిలో చేరినపుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి, చివరికి జనజీవన స్రవంతిలో చేరాడు. దళాన్ని వీడి పొలం బాట పట్టిన మాజీ మావోయిస్టు వాసన్నపై ప్రత్యేక కథనం.

బుట్టాయగూడెం: వాసన్నది వ్యవసాయ కుటుంబం. తాత, ముత్తాతలు కాలం నాటి నుంచి వ్యవసాయమే వృత్తి కావడంతో వాసన్నను బడికి పంపించకుండా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమయ్యేలా చేశారు అతని తండ్రి. అయితే అతనికి చదువుకోవాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పినప్పుడు ‘అన్న’లు చదువు నేరి్పస్తారని, సమసమాజ స్థాపనకు శ్రమిస్తారని చెప్పారట. దాంతో విప్లవ పారీ్టలో చేరాడు. అక్కడ అక్షర జ్ఞానం నేర్చుకోవడంతో పాటు తుపాకీ పట్టి అజ్ఞాత జీవితం గడుపుతూ వచ్చాడు. అనారోగ్యానికి గురై వైద్యం కోసం బాహ్య ప్రపంచంలోకి వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తరువాత తన జీవిత పంథాను మార్చుకున్నాడు. రైతుగా మారి నాగలి పట్టి పొలం దున్నుతున్నాడు. ‘సాక్షి’ ప్రతినిధి వాసన్నను పలకరించినపుడు ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. 

నా అసలు పేరు దారయ్య
మాది తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రాజెక్టు సమీపంలోని రంగాపురం గ్రామం. మా తల్లిదండ్రులు కారం సంకురు, కన్నమ్మలు. నేను మొదటి కుమారుడిని. నా అసలు పేరు కారం దారయ్య. పార్టీలో పిలిచే పేరు వాసన్న. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నాతో పాటు చెల్లి, తమ్ముడు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులే తప్ప ఎవ్వరం చదువుకోలేదు. నాకు చదువుకోవాలనే ఆశ ఉన్నా మా నాన్న వ్యవసాయ పనులకు తప్ప చదువుకు పంపేవారు కాదు. మా ఊరిలో ఒక విప్లవ సంస్థకు సంబంధించిన నాయకులు పోడు వ్యవసాయం, రైతు కూలీల సమస్యలు, ఇతర రాజకీయ వివరాల గురించి మీటింగ్‌లు పెట్టేవారు. వారిలాగే మాట్లాడాలని నాకు కోరిక ఉండేది. నాకు చదువులేక పోవడం వల్ల మాట్లాడలేక పోతున్నాననే బాధ ఉండేది.

ఒక రోజు మా గ్రామానికి చెందిన నా స్నేహితుడు అన్నల పార్టీలో చేరితే వారే చదువు చెప్తారని దానితో పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాలను నేర్పిస్తారంటూ చెప్పడంతో 1992వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరాను. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. అక్కడే అజ్ఞాతంలో ఉంటూ చదువుతో పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పట్టుసాధించాను. చురుగ్గా ఉన్న నన్ను పార్టీ దళ కమాండర్‌గా చేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే మమత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 18 సంవత్సరాల పాటు అడవిలోనే అజ్ఞాతంలో ఉన్నా. 2010లో నాకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళితే పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మమత స్వగ్రామమైన బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెంలో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయ పనులను ప్రారంభించి ఇక్కడ నివాసిగానే కొనసాగుతున్నాను.

రెండెడ్లు కొని వ్యవసాయం ప్రారంభించాడు
జైలు నుంచి బయటకు వచ్చిన నేను తదుపరి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో 5 ఎకరాల్లో కౌలు భూమి తీసుకున్నా. ఆ భూమిని దున్నేందుకు అప్పు చేసి రెండు కాడెద్దులను కొని వ్యవసాయాన్ని ప్రారంభించా. వ్యవసాయం ప్రారంభించిన రెండో సంవత్సరం 15 ఎకరాల్లో వ్యవసాయం చేశా. గత రెండేళ్లుగా 35 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నాను. వ్యవసాయ పనులు చేసుకుంటూ కొంతమంది కూలీలకు కూడా నా పొలంలో పని కల్పిస్తున్నాను. వ్యవసాయం చేయడంలో ఆనందం ఉంది. పది మందికి పని చూపిస్తున్నాననే సంతృప్తి కూడా ఇందులో కలుగుతోంది అంటున్నాడు వాసన్న. 

మరిన్ని వార్తలు