ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని

14 Apr, 2022 11:39 IST|Sakshi

నా జన్మధన్యమైంది

సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా

వైద్య, ఆరోగ్యశాఖ మహాభాగ్యం

గుంటూరును మెడికల్‌ హబ్‌గా చేస్తా

పల్నాడు వైద్యరంగంలో పెనుమార్పులు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శప్రదేశ్‌గా మార్చారు. ఆయన నాకు ఓ గొప్ప  అవకాశం ఇచ్చారు. ఆయన చేపట్టిన ఆరోగ్యయజ్ఞంలో భాగస్వామిని చేశారు. ఆ మహాయజ్ఞంలో దివ్య ఔషధమవుతా. నిరంతరం జన శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తా. ఇక నా జన్మ ధన్యమైనట్టేనని భావిస్తున్నా. సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని  నిలబెట్టుకుంటా’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విడదల రజిని ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

చదవండి: హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత

జీవితాంతం రుణపడి ఉంటా.. 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. రాజకీయాల్లో బీసీలు, ముఖ్యంగా మహిళలకు జగనన్న ఎంతో గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పడానికి నేనే పెద్ద ఉదాహరణ. నేను ఒక సాధారణ బీసీ మహిళను. చిలకలూరిపేటలాంటి నియోజకవర్గంలో నాలాంటి వారు పోటీ చేయడాన్ని ఎవరూ ఊహించరు. అలాంటిది జగనన్న నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి బరిలో నిలిపి గెలిచేలా చేశారు. నా గెలుపు ఒక చరిత్ర. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం ఆవిర్భవించాక ఇప్పటివరకు బీసీ సామాజికవర్గానికి చెందినవారు ఒక్కరు కూడా గెలవలేదు.

చిన్న వయసులోనే ఉత్తమ అవకాశాలు 
ప్రజలకు సేవ చేద్దామనే ఆకాంక్షతో చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త కుమారస్వామి, ఇతర కుటుంబసభ్యులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. జగనన్న ఎంతో నమ్మకం ఉంచి టికెట్టు ఇచ్చారు. కేవలం ఆయన చరిష్మాతోనే గెలిచాను. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. జగనన్న వల్లే నేను ఈ రోజు ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొందగలిగాను. ఆ తర్వాత మూడేళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించగలిగాను. ఇవన్నీ కేవలం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్లే సాధ్యమయ్యాయి. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కచ్చితంగా నిలబెట్టుకుంటాను.  వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు ఎంత కీలకమైనదో నాకు తెలుసు. జగనన్న నాపై ఎంత పెద్ద బాధ్యత ఉంచారో నాకు తెలుసు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా, జగనన్న ఆశయాలు 
సాధించేలా కృషి చేస్తాను.

జింఖానా కో–ఆర్డినేటర్లు, సభ్యులతో మాట్లాడతా 
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్యులకు గుంటూరు మెడికల్‌ కళాశాల నిలయం. ఉమ్మడి రాష్ట్రంలోనే గుంటూరు మెడికల్‌ కళాశాలకు ఎంతో పేరు ఉంది. ఇక్కడ చదువుకున్న వారిలో సుమారు 2వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తర అమెరికాలో స్థిరపడి బాగా పేరు, ప్రతిష్టలు సంపాదించారు. ఇప్పుడు వీరంతా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. వారి సంపాదనలో కొంత ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించడం హర్షించాల్సిన విషయం. వీరంతా జింఖానా పేరుతో అసోసియేషన్‌ స్థాపించి, రాష్ట్రం గర్వించేలా పనిచేస్తున్నారు. నేను అతి త్వరలోనే వీరితో సమావేశమై గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆగిపోయిన మాతా శిశుసంరక్షణ కేంద్రం పనులు పూర్తయ్యేలా చూస్తాను. ఇది పూర్తయితే హైదరాబాద్‌లో ఒక నీలోఫర్‌ ఆస్పత్రి, తిరుపతిలో ఒక రుయా ఆస్పత్రి  కంటే మెరుగైన సేవలు గుంటూరులోనే అందేటట్లు చేయొచ్చు. ఈ ఆస్పత్రిలో గుండె మార్పిడి, కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తా.

పల్నాడులో అత్యాధునిక ఆస్పత్రులు  
పల్నాడు గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్యం అవసరమైతే గతంలో గుంటూరు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. పిడుగురాళ్ల సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నరసరావుపేట జిల్లా వైద్యశాలను అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రోజు నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి రోగానికీ వైద్యం అందుతోంది. చిలకలూరిపేటలో కూడా వంద పడకల ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతోంది. బాపట్లలోనూ మెడికల్‌ కళాశాలను నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాధాన్య అంశాలే. అందుకే అంటున్నాను.. జగనన్న నాపై పెద్ద బాధ్యతనే ఉంచారు. మా నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టేలా నేను పనిచేస్తాను. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తా.

సేవల్లో దేశానికే ‘ఆదర్శ’ప్రదేశ్‌
మా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు తీసుకొస్తోంది. ఎన్నో సంస్కరణలు చేపడుతోంది. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం సత్వరమే అందేలా ఎంత చేయాలో అంత చేస్తోంది. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి జగనన్న వైద్య ఆరోగ్యశాఖ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు నిరంతరం తపిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే ప్రజలకు మేలైన వైద్యం అందుతోంది. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనంతగా 39వేల పోస్టులు భర్తీ చేయబోతున్నాం. 16 మెడికల్‌ కళాశాలలు కడుతున్నాం. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరిస్తున్నాం. ప్రతి గ్రామానికీ హెల్త్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నాం. కోవిడ్‌ సమయంలో మన ప్రభుత్వం ప్రజలకు అందించిన ఉచిత వైద్య సేవలు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. 

మరిన్ని వార్తలు