కారాగారం కాదు.. కర్మాగారం

2 Jul, 2022 10:23 IST|Sakshi

కడప సెంట్రల్‌ జైలు ఎంతో మంది ఖైదీలకు క్రమశిక్షణ.. కొత్తజీవితం.. మంచి నడవడిక నేర్పిస్తున్న స్థలం. ఖైదీలు ఇక్కడ నేర్చుకున్న వృత్తులు.. విడుదలయ్యాక వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. సెంట్రల్‌ జైలు  కారాగారంలా కాకుండా కర్మాగారంగా విలసిల్లుతోంది. ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ఖైదీలు తినుబండారాలు, సబ్బులు, ఫర్నీచర్‌ తయారు చేస్తున్నారు. సిమెంట్, ఇటుకలు సైతం ఉత్పత్తి చేస్తున్నారు. పాలడెయిరీ, 24గంటలపాటు పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నారు. ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారూ ఉన్నారు.   

కడప అర్బన్‌: సమాజంలో జీవిస్తున్న ప్రజల్లో కొందరు క్షణికావేశంతోనో, పరిస్థితుల ప్రభావంతోనో నేరాలకు పాల్పడి నేరతీవ్రతను బట్టి శిక్ష అనుభవిస్తున్నారు. మరికొందరు నేరాలకు పాల్పడకపోయినా చట్టం దృష్టిలో నేరస్తుడిగా రుజువు కావడంతో శిక్షలు అనుభవిస్తున్నవారు లేకపోలేదు.యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీ నుంచి మూడేళ్లు జైలు జీవితం గడిపే వారి వరకు కుటుంబాలపై ధ్యాస వెళ్లకుండా తమ వంతు కష్టపడి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు.  ప్రస్తుతం శిక్ష పడ్డ ఖైదీలు  బీరువాలు, పాఠశాల బెంచీలు తదితర వస్తువులు తయారు చేస్తారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. పెంట్రోల్‌ బంకు నిర్వహణ ద్వారా రోజుకు రూ.3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వ్యాపారం జరగుతుంది.  

►కడప కేంద్రకారాగారంలో మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడిన ఖైదీలకు వివిధ కేటగిరీల్లో  శిక్షణ ఇస్తున్నారు.దీనిని సద్వినియోగం చేసుకుని జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ  శిక్షపడిన ఖైదీలు 479 మంది, రిమాండ్‌లో ఉన్న వారు 163 మంది ఉన్నారు. వీరుగాక  పీడీ యాక్ట్‌ కింద 36 మంది ఖైదీలు ఉన్నారు.  

► ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్న వారందరికీ తాము పనిచేసిన కాలాన్ని బట్టి నిబంధనల మేరకు వేతనం, ప్రశంసాపత్రాలు, గుర్తింపునకు సంబంధించిన సర్టిఫికెట్‌లను అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిన తరువాత వారికి సమాజంలో తమకు పనిచేసుకునే వీలుగా ఈ సర్టిఫికెట్లు పంపిణి చేస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు.  

► కోవిడ్‌–19 సమయంలో మాస్క్‌లను తయారీ చేయడంలో ఖైదీలు కీలకపాత్ర పోషించారు.  

► విద్యాభివృద్ధిలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో చదువుకుని డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉన్నారు. యుగంధర్‌ అనే జీవిత ఖైదీ డిగ్రీ పూర్తి  చేయడంతో పాటు, పీజీని  సాధించగలిగారు.  

ఖైదీల సంక్షేమం కోసం కృషి  
కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తున్న వారందరికి ఏదో ఒకపనిమీద ధ్యాస కలిగేలా శిక్షణను ఇప్పిస్తున్నాం.వీరిలో సత్ప్రవర్తన ద్వారా త్వరగా విడుదలయ్యేందుకు కూడా ఈ శిక్షణలు దోహదపడతాయి.  ప్రతి జీవిత ఖైదీకి ఈ శిక్షణ ద్వారా మంచి విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఏర్పడింది. వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం 
    – ఐ.ఎన్‌.హెచ్‌ ప్రకాష్, సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం  

మరిన్ని వార్తలు