పెట్రోల్‌ కార్లదే హవా

23 Mar, 2023 04:16 IST|Sakshi

 దేశీయ మార్కెట్‌లో 70 % వాటాతో అగ్రస్థానం

గణనీయంగా తగ్గుతున్న డీజిల్‌ కార్ల అమ్మకాలు

క్రమంగా పుంజుకుంటున్న విద్యుత్‌ కార్ల అమ్మకాలు

ఐదేళ్లలో దేశంలో కార్ల మార్కెట్‌లో ఆసక్తికర మార్పులు

సాక్షి, అమరావతి: దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐదేళ్లలో కార్ల మార్కెట్‌పై దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశంలో కార్ల మార్కెట్‌ను పెట్రోల్‌ వెర్షన్‌ కార్లు శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. మార్కెట్‌లో 70 శాతం అమ్మకాలతో పెట్రోల్‌ వెర్షన్‌ కార్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

డీజిల్‌ కార్లపై వినియోగదారుల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. దీంతో వీటి అమ్మకాలు 18.50 శాతానికే పరిమితమయ్యాయి. విద్యుత్‌ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ మోడల్‌ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. 2018–19 నుంచి 2022–23లో దేశంలో కార్ల అమ్మకాల నివేదికను ప్రముఖ మార్కెటింగ్‌ రీసెర్చ్‌ సంస్థ  ‘జేటో డైనమిక్స్‌’ వెల్లడించింది. 

నివేదిక ఏం చెబుతోందంటే..
ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌ కార్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 2018–19లో దేశీయ కార్ల మార్కెట్‌లో పెట్రోల్‌ వెర్షన్‌ కార్ల అమ్మకాలు 60 శాతంగా ఉండేవి. ఇవి 2022–23లో 70 శాతం మార్కెట్‌ను సాధించాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు కూడా పెట్రోల్‌ వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి.

డీజిల్‌ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్‌ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దాంతో డీజిల్‌ వాహనాల కంటే పెట్రోల్‌ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండింటి ధరల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం లేదు. 

కొత్త మోడల్స్‌ లాంచింగ్‌లోనూ..
కార్ల కొనుగోలుదారుల ఆసక్తి కొత్త మోడళ్ల లాంచింగ్‌ను ప్రభావితం చేస్తోంది. కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్‌లోకి కొత్తగా పెట్రోల్, విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్‌ మార్కెట్‌లోకి 28 కొత్త మోడల్‌ కార్లను ప్రవేశపెట్టారు.

వాటిలో పెట్రోల్‌ వెర్షన్‌ కార్లు 13 ఉండగా.. విద్యుత్‌ కార్లు 8 ఉన్నాయి. డీజిల్‌ వెర్షన్‌ కార్లు ఆరు, సీఎన్‌జీ వెర్షన్‌ కారు ఒక మోడల్‌ భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాయి.

సగానికి తగ్గిన డీజిల్‌ కార్ల అమ్మకాలు
ఐదేళ్లలో దేశంలో డీజిల్‌ కార్ల అమ్మకాలు దాదాపు సగానికి తగ్గిపోయాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు, డీజిల్‌ ధరలు అమాంతంగా పెరుగుతుండటమే దీనికి కారణం. ఎస్‌యూవీ వాహనాల్లోనే డీజిల్‌ వెర్షన్‌కు డిమాండ్‌ ఉంది. సాధారణ కార్ల అమ్మకాల్లో డీజిల్‌ వాహనాలకు డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది.

2018–19లో దేశంలో డీజిల్‌ వెర్షన్‌ కార్ల వాటా 36 శాతం ఉండేది. కాగా 2022–23లో అది 18.50 శాతానికి తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2022–23నాటికి దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.

మరిన్ని వార్తలు