ఒడిశాతో కుమ్మక్కై.. టీడీపీ నేత నిర్వాకం 

31 Aug, 2021 04:36 IST|Sakshi

కొటియా పల్లెల ఆక్రమణకు మద్దతిస్తున్న మాలతిదొర   

ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి  

సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్‌   

సాలూరు: ఒడిశాతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న కొదమ టీడీపీ నాయకుడు చోడిపల్లి మాలతిదొరపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర డిమాండ్‌ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా దురాక్రమణలకు మాలతిదొరే కారణమని రాజన్నదొర విమర్శించారు. ఒడిశాలో కలిసిపోదామంటూ గిరిజనులను రెచ్చగొడుతున్న ఆయనను పోలీసులు విచారిస్తే కొటియా కుట్రలన్నీ బహిర్గతమవుతాయన్నారు. సోమవారం పట్టణంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. మాలతిదొర ఈ ఏడాది మార్చి నెలలో  కొదమ, సిరివర గ్రామాల్లో ఒడిశా నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ  ప్రజలను ఒడిశాలో కలిసిపోదామంటూ రెచ్చగొట్డాడని చెప్పారు.

ఒడిశా ఉత్సవ్‌ దివస్‌ జెండాను కొటియా పల్లెల్లో మాలతిదొరచే ఒడిశా నాయకులు ఎగురవేయించారంటే ఆయన తీరును అర్థం చేసుకోవచ్చన్నారు.  ఈ అంశంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. గత టీడీపీ హయాంలో గిరిజనులకు మంజూరైన పథకాల్లో మాలతిదొర అనేక అక్రమాలకు పాల్పడినట్లు లిఖిత పూర్వక ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో విచారణ కొసాగుతుందని వెల్లడించారు. కొటియా గ్రామాలపై సుప్రీంకోర్టులో  స్టేటస్‌కో అమలులో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.  

మరిన్ని వార్తలు