AP: హోరెత్తిన సామాజిక భేరి

27 May, 2022 04:04 IST|Sakshi
సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఘన స్వాగతం పలుకుతున్న జనసందోహం

శ్రీకాకుళంలో మొదలైన మంత్రుల బస్సుయాత్రకు అడుగడుగునా జన హారతి 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/పీఎన్‌కాలనీ/రణస్థలం /జి.సిగడాం/శ్రీకాకుళం రూరల్‌/నెలిమర్ల/డెంకాడ: సామాజిక సంక్షేమ కెరటాలతో ఉత్తరాంధ్ర ఉప్పొంగింది. రాజ్యాధికారంలో భాగస్వాములైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను తిలకించి నాగావళి మురిసిపోయింది. ఆయా వర్గాలకు సామాజిక న్యాయాన్ని చేకూరుస్తూ రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్న ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. సామాజిక మహా విప్లవంతో దేశంలో పెను మార్పులకు సీఎం జగన్‌ ఆద్యుడిగా నిలిచారని, విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాల వల్ల రాజ్యాధికార బదిలీ జరిగి అన్ని స్థాయిల్లోనూ సామాజిక న్యాయం అమలు జరుగుతోందని పేర్కొంటున్నారు.   

ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభం
‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’కు జనవాహిని పోటెత్తడంతో సిక్కోలు జాతరను తలపించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలను వివరిస్తూ 17 మంది మంత్రులతో కూడిన బృందం ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను గురువారం శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించింది. దారి పొడవునా ప్రజల దీవెనలతో పలు ప్రాంతాల మీదుగా మండుటెండలోనూ తొలిరోజు యాత్ర ఉత్సాహభరితంగా సాగింది. అయితే వర్షం కారణంగా సాయంత్రం విజయనగరంలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దైంది. అప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సభ నిర్వహణకు సరిగ్గా అరగంట ముందు వర్షం కురవడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా రద్దు చేయాలని నిర్ణయించారు. 
అశేష జనవాహిని మధ్య సాగుతున్న బస్సుయాత్ర 

కిక్కిరిసిన రహదారులు 
మంత్రులు తొలుత శ్రీకాకుళంలో స్థానిక హోటల్‌లో మీడియాతో సమావేశం అనంతరం ఏడు రోడ్ల కూడలిలో దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడి బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభ స్థలం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రావ్, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్, కొమురం భీమ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్సు యాత్ర సందర్భంగా శ్రీకాకుళం ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. సామాజిక న్యాయభేరి రథానికి ముందు వేలాది మోటార్‌ బైక్‌ల ర్యాలీ కొనసాగింది. దీంతో కిలోమీటర్ల మేర కోలాహలం నెలకొంది.

ప్రజలను కలుసుకుంటూ..
శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర బైపాస్, చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. దారిపొడవునా మంత్రులు ప్రజల్ని కలుసుకుని పలుచోట్ల మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసింది? రాజ్యాధికారంలో ఎలా భాగస్వాములను చేసిందో వివరించారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రతి పల్లె కదలి రావడంతో చిలకపాలెం, రణస్థలం జనసంద్రమైంది. విజయనగరం జిల్లాలో కందివలస, అగ్రహారం, కుమిలి, ముంగినాపల్లి, గుణుపూరుపేట, జమ్ము మీదుగా విజయనగరంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది.  
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు 

అణగదొక్కిన బాబు..
టీడీపీ రథ చక్రాలు ఇప్పటికే కూలిపోయాయని, రానున్న రోజుల్లో ఆనవాలు కూడా ఉండదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కారన్నారు. భావితరాలు గర్వించే విధంగా సీఎం జగన్‌ దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌ మూడేళ్లలో చేకూర్చిన సంక్షేమం, కేబినెట్, స్థానిక సంస్థలు కార్పొరేషన్లలో ఎన్ని అవకాశాలు కల్పించారో తెలియజేసేందుకే యాత్ర చేపట్టామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అయితే సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైఎస్‌ జగన్‌ అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హోంమంత్రి తానేటి వనిత శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే అందించిన ఘనత జగనన్న ప్రభుత్వానిదని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ చెప్పారు. సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం మహిళలకే దక్కాయని మంత్రి విడదల రజిని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో బస్సు యాత్ర సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి ఉద్యమాలు అవసరం లేకుండా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.

సీఎం జగన్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ సామాజిక న్యాయం వైపు నడిపిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. చివరకు రాజ్యసభ పదవుల్లో సైతం సామాజిక న్యాయం చేకూరిందన్నారు. ఈ మేలును ఓ వర్గం మీడియా ప్రజలకు చెప్పడం లేదని, బస్సు యాత్ర ద్వారా వాస్తవాలు వివరిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, అంజాద్‌ బాషా, కె.నారాయణస్వామి, మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు,  గుమ్మనూరు జయరాం, ఎంవీ ఉషశ్రీచరణ్‌లు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. 

ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రులు

ఇన్నాళ్లకు సాకారం 
– మంత్రి ధర్మాన 
పాలనలో బడుగులను భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోందని, ఇన్నేళ్లకు సీఎం జగన్‌ సాకారం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు.  బస్సుయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు.  తమ ప్రభుత్వంలో ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని రుజువు చేయగలరా అని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.  

అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం జగన్‌ పాలన: మంత్రి బొత్స
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం జగన్‌ పాలన కొనసాగుతోందని విద్యాశాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సామాజికంగా నూతన ఒరవడి రావాలంటే బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నారు. 

వేదికపై ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు

చంద్రబాబు ఆటలు సాగవు
–మంత్రి సీదిరి అప్పలరాజు
వెనుకబడిన కులాలకు ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రులు బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.స్వాతంత్య్రం వచ్చిన తరువాత చరిత్రలో తొలిసారిగా ఓ మత్స్యకార నేతను రాజ్యసభకు సీఎం పంపించారన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు ప్రతిపాదిస్తే చంద్రబాబు అండ్‌ కో అల్లర్లు సృష్టిస్తున్నారని, వారి ఆటలు సాగవని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు