ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్‌ శర్మ

1 Oct, 2021 02:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ స్థానంలో ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారంతో రాష్ట్ర పురోభివృద్ధి, నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని సమీర్‌శర్మ తెలిపారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు వీడ్కోలు, డాక్టర్‌ సమీర్‌ శర్మకు స్వాగత సభ కార్యక్రమాన్ని గురువారం సచివాలయం మొదటి బ్లాక్‌ సీఎం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఏపీని ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యం: ఆదిత్యనాథ్‌దాస్‌
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా, అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆదిత్యనాథ్‌దాస్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన తొలి ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందితో కలసి టీమ్‌ వర్క్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేశామన్నారు. పదేళ్లపాటు నీటిపారుదల శాఖలో పనిచేసిన తనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రితోపాటు యావత్‌ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. తన పదవీకాలంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా అందరినీ సమానభావంతో చూశానన్నారు. నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ సమీర్‌శర్మను తాను నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్ధుడైన అధికారి అని, నూతన భావాలు కలిగినవారని అభినందించారు. 

మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు: సమీర్‌ శర్మ
తనకు సాదర స్వాగతం పలుకుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు నూతన సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆదిత్యనాథ్‌దాస్‌ తన కుటుంబ స్నేహితుడని చెప్పారు. ఆయనది పదవీ విరమణ కాదని, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మరో ప్రస్థానాన్ని  ప్రారంభిస్తున్నారని తెలిపారు. 

ఉన్నత విలువలు ఆయన సొంతం..
సభకు అధ్యక్షత వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆదిత్యనాథ్‌దాస్‌ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అధికారులందరికీ పలు అంశాల్లో నిరంతరం మార్గదర్శనం చేసే వారని చెప్పారు. డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ అనే పుస్తకాన్ని రచించడం ద్వారా ఆయనలో మంచి కవి ఉన్నాడని నిరూపించారన్నారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరువర్గాలను పిలిచి సామరస్యపూర్వకంగా పరిష్కరించే వారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కొనియాడారు. నీటిపారుదల రంగంలో విశేష అనుభవాన్ని గడించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను వాటర్‌మెన్‌గా పిలవవచ్చని సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సమర్థంగా పనిచేశారని, సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సమీర్‌ శర్మ పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సునీత చెప్పారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ మంచి మానవతావాది అని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ ఫైళ్లను చాలా వేగంగా క్లియర్‌ చేసేవారని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ వద్ద సౌకర్యవంతంగా విధులు నిర్వహించగలిగినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ దాస్, డాక్టర్‌ సమీర్‌ శర్మను ఈ సందర్భంగా అధికారులు దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సమాచార, పౌర సంబంధాలశాఖ ఈవో కార్యదర్శి టి.విజయకుమార్‌రెడ్డి, ఆర్ధిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు