Samta Express: బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌.. కిలో మీటర్‌ దూరం వెళ్లి..

12 May, 2022 09:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిలోమీటర్‌ మేర రైలింజన్‌ ప్రయాణం

లోకోపైలెట్‌ సమయస్ఫూర్తి 

‘సమతా’ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు 

పార్వతీపురం టౌన్‌/ సీతానగరం(పార్వతీపురం జిల్లా): విశాఖ నుంచి నిజాముద్దీన్‌ వెళ్లే సమతా సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు బుధవారం ఉదయం 9.20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరింది. 11 గంటలకు సీతానగరం రైల్వేస్టేషన్‌ దాటింది. సీతానగరం–పార్వతీపురం రైల్వే స్టేషన్ల మధ్యలో గుచ్చిమి గ్రామం రైల్వే గేట్‌ సమీపంలో సాంకేతిక కారణాలతో బోగీల నుంచి ఇంజిన్‌ విడిపోయింది. ఇంజిన్‌ విడిపోయిన విషయాన్ని గ్రహించిన లోకోపైలెట్‌ ఇంజిన్‌ను నిలుపుదల చేయకుండా కిలోమీటరు మేర ముందుకు తీసుకెళ్లి నిలిపాడు.
చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను

ఇంజిన్‌ వేగాన్ని ఏ మాత్రం తగ్గించినా బోగీలు దానికి ఢీకొని రైలు పడిపోయి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే లోకోపైలెట్‌ చాకచక్యంగా ఇంజిన్‌ ముందుకు తీసుకెళ్లాడు. వెనుక వస్తున్న బోగీలు వేగం తగ్గి అవి పూర్తిగా నిలిచిపోయాక.. తిరిగి ఇంజిన్‌ను వెనుక్కు తీసుకెళ్లి బోగీలకు అమర్చాడు. సాంకేతిక లోపాలను సరిదిద్దాక రైలు ముందుకు సాగింది. 11.36 గం.కు పార్వతీపురం రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సిన సమతా ఎక్స్‌ప్రెస్‌ 12.30 గం.కు చేరుకుంది. లోకోపైలెట్‌ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు