నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్‌

16 Dec, 2020 04:33 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ సూచన

శాస్త్రీయ సర్వేతో పరిమితంగా అనుమతించాలి

అక్రమ తవ్వకాలను అరికట్టాలి 

రిజర్వాయర్లు, నదుల్లో పూడిక తీతకు తొలగిన అవరోధం

సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్‌ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక డ్రెడ్జింగ్‌ /తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గత సర్కారు 2016లో జారీ చేసిన మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ సవరణ (ఇసుక పాలసీ) ఉత్తర్వులను కొందరు ఎన్జీటీలో సవాల్‌ చేయడం తెలిసిందే. దీనివల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు.

ఈ మినహాయింపులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తక్షణమే దీనిపై స్టే విధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్‌ ఎన్జీటీలో సవాల్‌ చేశారు. ప్రకాశం బ్యారేజిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటూ అనుమోల్‌ గాంధీ కూడా ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విషయంలో ఎన్జీటీ 2018లో నాటి ప్రభుత్వానికి కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలని, దీన్ని ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి వసూలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్‌ జరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది.  

గణాంకాలతో ఎన్జీటీకి ప్రభుత్వం నివేదిక..
పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడిక (ఇసుక)ను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని  వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎన్జీటీ తీర్పులో కీలక అంశాలివీ..
– ఇసుక డీసిల్టింగ్‌/ డ్రెడ్జింగ్‌/ మైనింగ్‌ నిర్వహించే ప్రాంతాల్లో శాస్త్రీయ పర్యవేక్షణ నిమిత్తం సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడం సులభమవుతుంది.
– శాస్త్రీయ సర్వే నిర్వహించి నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుక డ్రెడ్జింగ్‌ నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. (ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి కఠిన నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాగున్నాయి. ఇవి పక్కాగా అమలు చేస్తే చాలు)
– డ్రెడ్జింగ్‌/ డీసిల్టింగ్‌కు అనుమతుల కోసం  ప్రతి జిల్లాలో శాశ్వతంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు