Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ

28 Apr, 2021 04:43 IST|Sakshi

ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు

పాడి రైతులు, వినియోగదారుల విçస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం

తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు బాధ్యతల అప్పగింత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల కేసులో ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు

సాక్షి అమరావతి/సాక్షి, గుంటూరు/చేబ్రోలు (పొన్నూరు): టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, డెయిరీ ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు గతంలో డెయిరీ ఆస్తులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 515ను సర్కార్‌ ఉపసంహరించింది. పాడి రైతుల నుంచి పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ తదితర డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులతో నిర్వహించేందుకు పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది.

ఐదో రోజూ ఏసీబీ సోదాలు
సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, జిల్లా కో–ఆపరేటివ్‌ మాజీ ఉద్యోగి ఎం.గురునాథంలను గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా డెయిరీలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. వరుసగా ఐదో రోజు మంగళవారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్డులను, కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు. 

ప్రభుత్వానికి ఏసీబీ నివేదన
ప్రభుత్వం గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఇచ్చిన భూముల నుంచి 10 ఎకరాల భూమిని తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరిట ఉన్న ట్రస్టుకు అక్రమంగా ధూళిపాళ్ల నరేంద్ర బదలాయించినట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. పైగా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ట్రస్టీ కమ్‌ ఎండీగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తనకు తానుగా ప్రకటించుకున్నారని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పేరున ఉన్న ఆస్తులను తనఖా పెట్టి నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నుంచి రూ.115 కోట్లను నరేంద్ర రుణాలుగా పొందినట్టు తెలిపింది. పశు ప్రదర్శనలు, విద్య, శిక్షణ కార్యక్రమాల కోసం బదలాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్టు పేర్కొంది. 

లీజు హక్కులను ఉపసంహరించిన ప్రభుత్వం
ప్రస్తుతం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులు గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన లీజు హక్కులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఆస్తులపై ఇక నుంచి పాలకవర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసింది. డెయిరీకి ఉన్న రూ.కోట్ల విలువైన ఇతర ఆస్తులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌కు అప్పగించింది. ప్రొక్యూర్‌మెంట్, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ ఇతర కార్యకలాపాలన్నీ ఇప్పుడున్న అధికారులు, ఉద్యోగుల ద్వారా యధావిధిగా జరిగేలా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు మయూర్‌ అశోక్‌ బాధ్యతలు స్వీకరించి రికార్డులను పరిశీలించారు.  

మరిన్ని వార్తలు