చెత్త బుట్టలో 6 గ్రాముల బంగారు ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ఆమె ఏం చేసిందంటే?

28 Sep, 2022 04:46 IST|Sakshi
బంగారు ఉంగరం

పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ

వెతికివ్వాలంటూ ‘స్పందన’లో ఫిర్యాదు

5 గంటల పాటు ఉంగరాన్ని వెతికి అప్పగించిన పారిశుధ్య కార్మికులు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్‌ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది.

ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్‌ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్‌పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది.

ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్‌ దినేశ్‌కుమార్‌.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు.

శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బుద్ధ శ్రీను, శానిటేషన్‌ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. 

>
మరిన్ని వార్తలు